
Hanamkonda : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు తేల్చారు. మూడు రోజుల క్రితం ఎల్కతుర్తి దగ్గర ఒక కారు వెనుక భాగంలో ఒక మహిళ శవం కనిపించడం కలకలం రేపింది. ఆ చనిపోయిన మహిళ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానస అని పోలీసులు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తన సొంత తండ్రి చెప్పిన మాటల వల్లే వినోద్ అనే వ్యక్తి మానసను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Also Read : బంగ్లాదేశ్ లో ఘోరం… రిటైర్డ్ హిందూ ఉపాధ్యాయ కుటుంబం దారుణ హత్య
మానసకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి, కానీ ఇద్దరితోనూ విడాకులు తీసుకోవడంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. ఆ సమయంలో ఆమె కరీంనగర్‌కు చెందిన వినోద్‌కుమార్‌తో స్నేహంగా ఉంది. గత వారం తాను అరుణాచలం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన మానస, నేరుగా వినోద్ గదికి వెళ్లింది. అక్కడ తనను పెళ్లి చేసుకోవాలని వినోద్‌పై గట్టిగా ఒత్తిడి తెచ్చింది. ఈ విషయాన్ని వినోద్ వెంటనే మానస తండ్రి రాజేశంకు ఫోన్ చేసి చెప్పాడు.
మానస ఎవరి మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు తిరుగుతోందని, ఆమె వల్ల తమ పరువు పోతోందని తండ్రి ఆవేశపడ్డాడు. కావాలంటే ఆమెను చంపేయమని వినోద్‌కు తండ్రి రాజేశం చెప్పాడు. పెళ్లి చేసుకోమని రోజూ వేధిస్తుండడంతో విసుగు చెందిన వినోద్, మానస గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని కారు డిక్కీలో పెట్టి ఎల్కతుర్తిలోని తన ఇంటికి తీసుకెళ్లాడు.
కొన్ని రోజులు కావడంతో కారులో నుంచి భయంకరమైన వాసన వచ్చింది. అది చూసి అనుమానం వచ్చిన చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కారు డిక్కీ తెరిచి చూడగా అసలు విషయం బయటపడింది. వెంటనే వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తండ్రే కూతుర్ని చంపమని చెప్పి ఈ దారుణానికి కారణం కావడంతో అందరూ షాక్ అయ్యారు.
Also Read : ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్!









