Telangana :  తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయంగా కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిల వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ అంశానికి సంబంధించి కమిటీ సర్వత్ర చర్చనీయాంశమైన కీలక సిఫార్సులు చేసింది.

మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని, అలాగే చిన్నారెడ్డిని ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని కమిటీ గట్టిగా భావించింది. వ్యక్తుల స్థాయి ఎంత పెద్దదైనా, పార్టీ, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించకూడదని నిర్ణయించింది.

Also Read : కొండా సురేఖ బిడ్డ అని ఊరుకుంటున్నాం.. లేకపోతేనా : జగ్గారెడ్డి సంచలన కామెంట్స్!

పార్టీ అధిష్టానం ముందే హెచ్చరించినా కొండా సురేఖ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని కమిటీ అభిప్రాయపడింది. సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని కించపరిచేలా ఆమె కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు చేసినా, మంత్రిగా ఉన్న సురేఖ వాటిని ఖండించకపోవడాన్ని తీవ్ర తప్పుగా పరిగణించింది. కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ ఆమె ఇచ్చిన వివరణను కమిటీ తోసిపుచ్చింది.

క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన చిన్నారెడ్డి మరింత బాధ్యతాయుతంగా ఉండాలని, కానీ ఆయన పార్టీకి, స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తాయని కమిటీ నివేదించింది.

క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్, ఎంపీ మల్లు రవి నేతృత్వంలో తయారైన ఈ నివేదికను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అందజేశారు. క్రమశిక్షణ తప్పిన వారిపై హైకమాండ్ ఎటువంటి కఠిన చర్యలు తీసుకోనుందనే దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read : ఒత్తిడిలో తప్పు చేశా.. ఆ అమ్మాయి మంచిది… తప్పు ఒప్పుకున్న ఫోక్ డ్యాన్సర్..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.