Kolkata : కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా పూజా మండపం వద్ద భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సప్తమి రోజు రాత్రి సుమారు 7.40 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. భారీ సంఖ్యలో భక్తులు, సందర్శకులు ప్రముఖమైన ఈ పూజా మండపానికి వచ్చారు. జనాల రద్దీ ఎక్కువ కావడంతో బయట ఉన్న ఎగ్జిట్ గేటుపై తీవ్ర ఒత్తిడి పడినట్లు సమాచారం. ఆ ఒత్తిడిని తట్టుకోలేక గేటు కూలిపోయినట్లు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాల్లో భయాందోళనలు మొదలై తొక్కిసలాట జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Also Read : నా కళ్ల ముందే అమ్మ చనిపోయింది.. కోల్‌కతా తొక్కిసలాటపై ప్రత్యక్ష సాక్షులు సంచలన విషయాలు!

అయితే అసలు తొక్కిసలాటకు కారణం ఏంటన్నది ఇంకా పూర్తిగా తేలలేదు. మండపం నిర్వాహకులు లౌడ్‌స్పీకర్‌లో చేసిన ఓ ప్రకటన, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఊదిన విజిల్స్ వల్లే జనాల్లో ఒక్కసారిగా కదలిక మొదలైందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గాయపడిన వారిని కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో పరామర్శించారు.

ఈ ఘటనకు సంబంధించి పూజా కమిటీ కార్యదర్శి రాజ్ కుమార్ సెవ్డా, వైస్ ప్రెసిడెంట్ శంతను దూబేలను పోలీసులు అరెస్ట్ చేశారు. మండపం కోసం వెదురు నిర్మాణం చేసిన బ్లాబ్ ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు. జనాలను నియంత్రించే బాధ్యతలు చూసిన కౌశిక్ సాహా, పింటు డేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌లుగా పనిచేసిన సుమన్ చక్రవర్తి, రాజేశ్ పాల్‌ను కూడా అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

మండపం వద్ద జనాలను ఎలా నియంత్రించారు, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ గేటు ఎందుకు కూలిపోయింది, లౌడ్‌స్పీకర్ ప్రకటన లేదా సెక్యూరిటీ సిబ్బంది విజిల్స్ వల్లే జనాల్లో ఒక్కసారిగా పరుగులు మొదలయ్యాయా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు అసలు కారణం ఏంటో దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది.

Also Read : నెలనెలా రీఛార్జ్ తిప్పలకు గుడ్‌బై: జియో, ఎయిర్‌టెల్, Vi సీక్రెట్ ప్లాన్స్ ఇవే..!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.