Tiger Shroff
Tiger Shroff

బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలో కాల్పులు జరిపిన తర్వాత పూణే-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పారిపోతున్న నిందితులను రాజస్థాన్‌లోని కోటాలో అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న డీఎస్పీ, సైబర్ సెల్ బృందం కేవలం 15 నిమిషాల్లోనే వల పన్ని.. రైలు మొత్తం సోదా చేసి ఆ ముగ్గురినీ పట్టుకున్నారు. వారు ఢిల్లీ మీదుగా నేపాల్‌కు పారిపోవాలని ప్లాన్ చేసుకున్నట్లు కోటా ఎస్పీ తేజస్విని గౌతమ్ తెలిపారు. వారిని త్వరలోనే ముంబై పోలీసులకు అప్పగించనున్నారు.

కాల్పులు జరిపిన వారిలో రేహన్, హృతిక్, ఒక మైనర్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనిల్ పండిట్ అనే వ్యక్తి వీరిని సంప్రదించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ముగ్గురిలో హృతిక్ అనే నిందితుడు ర్యాపిడో రైడర్‌ అని పోలీసులు గుర్తించారు. ఇతడికి ఆ ప్రాంతమంతా బాగా తెలియడంతో హృతిక్‌ను సంప్రదించినట్లు పేర్కొన్నారు. అలాగే మరొక వ్యక్తి రేహన్ సోనిపత్‌లో వెల్డింగ్ పనిచేసేవాడు. దేవ్రు గ్రామానికి చెందిన అతడు.. తన తల్లి, తమ్ముడితో కలిసి నివసిస్తున్నాడు.

తొమ్మిదో తరగతిలో ఫెయిల్ అయి చదువు మానేసిన రేహాన్.. ఆ తర్వాత నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇందులో భాగంగానే చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు రేహాన్ గతంలో జైలుకు వెళ్లాడు. ఇక చివరి నిందితుడైన మైనర్ టైల్స్ వేసేవాడుగా గుర్తించారు. అతడు తన తండ్రి దగ్గర పని నేర్చుకుంటున్నట్లు తెలిపారు. ఆ మైనర్ తండ్రి వికలాంగుడని తెలిపారు.