
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ఉద్యోగులకు స్వీట్లు, గిఫ్ట్ హ్యాంపర్లు, బట్టలు ఇలా రకరకాల కానుకలు ఇవ్వడం చాలా కంపెనీల్లో ఆనవాయితీగా ఉంటుంది. కానీ ఢిల్లీలోని ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఊహించని కానుకలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను దీపావళి గిఫ్ట్‌లుగా అందించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి కానుకలకు సంబంధించిన వీడియోను అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆఫీసులోని ఉద్యోగుల డెస్క్‌లపై కొత్త ఐఫోన్ 16 ఫోన్లు కనిపిస్తున్నాయి. ప్రతి ఫోన్‌ను అందంగా రిబ్బన్‌తో అలంకరించి ఉద్యోగుల కంప్యూటర్ల ముందు పెట్టారు. తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఉన్న ఐఫోన్లు వీడియోలో కనిపించాయి.
సుమారు 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చివర్లో కొంతమంది మహిళా ఉద్యోగులు తమకు వచ్చిన కానుకలను చూసి ఎంతో సంతోషంగా స్పందించడం కనిపిస్తుంది. సాధారణంగా పండుగల సమయంలో కంపెనీలు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ బాక్సులు ఇస్తుంటాయి. కానీ ఈ కంపెనీ మాత్రం ఏకంగా ఖరీదైన ఐఫోన్లను బహుమతిగా ఇవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ కంపెనీ మీకు దీపావళికి ఏం గిఫ్ట్ వచ్చింది? అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ వీడియో కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలామంది కంపెనీ ఇచ్చిన కానుకలను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగుల పట్ల ఇంత మంచి ఆలోచన చూపించడం నిజంగా అభినందించాల్సిన విషయమని కామెంట్లు చేస్తున్నారు.
🚨 A Delhi-based company has surprised its employees with iPhone 16 smartphones as Diwali gifts. https://t.co/pZaO0XQ903
— Indian Tech & Infra (@IndianTechGuide) November 4, 2026
అయితే ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు మొదట అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. నిజంగానే కంపెనీ ఐఫోన్లు ఇచ్చిందా? లేక ఏఐతో వీడియో తయారు చేశారా? అంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కంపెనీ.. నవ్వుతూ, మరోసారి వీడియోను జాగ్రత్తగా చూడాలని సూచించింది. ఇది ఏఐతో తయారు చేసిన వీడియో కాదని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వీడియో కింద కామెంట్లతో సందడి మొదలైంది. “ఈ కంపెనీలో ఉద్యోగాలు ఏమైనా ఖాళీగా ఉన్నాయా? ఉంటే చెప్పండి.. నేను కూడా చేరిపోతా” అంటూ ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఇంకొకరు మాత్రం ఇలాంటి వీడియోలు చూసి అసూయ కలగకుండా ఉండాలంటే దీపావళి సమయంలో ఇన్స్టాగ్రామ్ చూడటమే మానేయాలని సరదాగా అన్నారు.
ఇక కొంతమంది నెటిజన్లు మరింత ఫన్నీగా స్పందించారు. మహిళా ఉద్యోగులకు ఐఫోన్లు ఇస్తే, పురుష ఉద్యోగులకు బంగారు నాణేలు ఇచ్చి ఉంటారని ఒకరు సరదాగా కామెంట్ చేశారు. మరో నెటిజన్ అయితే తమ కంపెనీలో కనీసం సోన్ పప్డీ స్వీట్ల బాక్స్ కూడా ఇవ్వలేదని తన బాధను కామెంట్ రూపంలో చెప్పుకున్నాడు. మొత్తానికి దీపావళి సందర్భంగా ఉద్యోగులకు ఐఫోన్ 16 కానుకగా ఇచ్చిన ఈ కంపెనీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పండుగ సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ఈ ఖరీదైన బహుమతులు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.









