నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో వరుసగా అవకతవకలు జరుగుతున్నాయి. వీటివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు పేపర్ లీకేజీలు కాగా.. మళ్లీ ఇప్పుడు తాజాగా హాల్ టికెట్ల జారీలో విషయంలో ఎన్టీఏ బ్లండర్ మిస్టేక్ చేసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల నీట్ అభ్యర్థి అబ్దుల్లా మహమ్మద్ తాలిబ్ తన హాల్ టికెట్ చూసి షాక్ అయ్యాడు. నాగ్‌పూర్‌‌కు చెందిన తాలిబ్‌కు పరీక్ష సెంటర్ ఏకంగా 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూఏఈ రాజధాని అబుదాబిలో పడింది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ విద్యార్థి దగ్గర కనీసం పాస్‌పోర్ట్ కూడా లేదు. దీంతో తాలిబ్‌తో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

నిజానికి ఎన్టీఏ విదేశాలలో కూడా నీట్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. కానీ అవి అక్కడ నివసించే ఎన్నారై లేదా అంతర్జాతీయ విద్యార్థుల కోసమే కేటాయిస్తారు. ఇటీవల నీట్ రీ ఎగ్జామ్ సందర్భంగా విడుదల చేసిన హాల్ టికెట్‌లో తాలిబ్‌కు అబుదాబి ఇండియన్ స్కూల్ పరీక్ష సెంటర్‌గా వచ్చింది. దీంతో కంగారుపడిన ఆ కుటుంబం వెంటనే ఎన్టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించారు. అక్కడి అధికారి ఒకరు పొరపాటును సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ పరీక్షకు ఇంకా రెండు రోజులే టైమ్ ఉన్నప్పటికీ ఎన్టీఏ నుండి ఎలాంటి స్పందన రాలేదు.. తప్పు కూడా సరిదిద్దలేదు. సెంటర్ మార్చకపోతే ఇంత తక్కువ టైమ్‌లో పాస్‌పోర్ట్, విమాన టిక్కెట్లు ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియక తాలిబ్ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు.

ఒక్క తాలిబ్ మాత్రమే కాదు.. తాము అసలు ఎంచుకోకపోయినా తమ పిల్లల పరీక్షా కేంద్రాలను ఎన్టీఏ ఇష్టమొచ్చినట్టు మార్చేసిందని దేశవ్యాప్తంగా చాలా మంది తల్లిదండ్రులు వాపోతున్నారు. గత నెలలో నీట్ పరీక్ష రద్దు అయిన తర్వాత, ఎన్టీఏ విద్యార్థుల మొబైల్ నంబర్లకు మెసేజ్‌లు పంపింది. పాత పరీక్షా కేంద్రంలోనే ఎగ్జామ్ రాస్తారా? లేక కొత్త సెంటర్ కావాలా? అని అందులో అడిగింది. నాగ్‌పూర్‌తో పాటు పలు నగరాలకు చెందిన విద్యార్థులు తమకు పాత సెంటరే కావాలని ఆప్షన్ ఎంచుకున్నారు. కానీ తీరా కొత్త హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని చూస్తే.. కొందరికి చాలా మారుమూల గ్రామాల్లో, మరికొందరికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు పడ్డాయి.

అయితే ఎన్టీఏలో ఇలా సాంకేతిక సమస్యలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో నీట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినప్పుడు ఒకే హాల్ టికెట్ నంబర్‌పై ఇద్దరు విద్యార్థులకు వేర్వేరు మార్కులు వచ్చాయి. అలాగే ఒక విద్యార్థికి ఓఎంఆర్ షీట్‌లో ఎక్కువ మార్కులు వచ్చినా కూడా రిజల్ట్‌లో మాత్రం సున్నా లేదా సింగిల్ డిజిట్ మార్కులు కనిపించాయి. గతంలో సమయం వృథా అయిందనే కారణంతో కొందరు విద్యార్థులకు ఎన్టీఏ భారీగా గ్రేస్ మార్కులు యాడ్ చేసింది. దీంతో ఒకేసారి కొందరు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ (720/720 మార్కులు) వచ్చాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో వాటిని రద్దు చేసింది. ఇటీవలి కాలంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం, కోట్ల రూపాయలకు ప్రశ్నపత్రాలు అమ్ముడుపోవడం వంటి స్కాములు బయటపడిన ఘటనలు ఉన్నాయి.