
Sai Krishna Missing Case : విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అలియాస్ పిళ్లా సాయి (25) అదృశ్యం కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక మిస్సింగ్ కేసులా కాకుండా, ఖాకీల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయాడనే “లాకప్ డెత్” తీవ్ర ఆరోపణలతో రాజకీయ, సామాజిక వర్గాల్లో దావానలంలా వ్యాపించింది. అసలు ఆ రాత్రి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగింది? సాయికృష్ణ బతికే ఉన్నాడా లేక పోలీసుల చిత్రహింసలకు బలయ్యాడా? అనే ప్రశ్నల చుట్టూ ఇప్పుడు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
సాయికృష్ణ నేపథ్యాన్ని పరిశీలిస్తే, విజయవాడ కృష్ణలంక నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన ఈ యువకుడు తొమ్మిదో తరగతితోనే చదువు మానేశాడు. తండ్రి మరణించడంతో తల్లి విజయలక్ష్మితో కలిసి నివసించేవాడు. చిన్న వయసులోనే దారి తప్పిన సాయికృష్ణపై కృష్ణలంక, మాచవరం, పటమట వంటి పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి, పోక్సో సహా విభిన్న అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు అతనిపై రౌడీషీట్ కూడా తెరిచారు. ఒక మర్డర్ కేసులో జైలుకు వెళ్లి ఈ ఏడాది మార్చిలోనే బెయిల్‌పై బయటకు వచ్చిన సాయికృష్ణ, ఆ తర్వాత ప్రకాశం జిల్లా మార్కాపురానికి వలస వెళ్ళాడు.
కుటుంబ సభ్యులు, తల్లి విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మే 9వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద కృష్ణలంక పోలీసులు ఇద్దరు సిబ్బందితో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) అమలు చేయడానికే టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అతడిని పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే, మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత సాయికృష్ణ మళ్లీ ఇంటికి చేరలేదు, కోర్టులోనూ హాజరుపరచలేదు. అప్పటి నుండి అతని ఆచూకీ పూర్తిగా లభ్యం కాకుండా పోయింది.
గత నెల రోజులకు పైగా తన కొడుకు ఆచూకీ కోసం విజయలక్ష్మి కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగింది. ఈ క్రమంలో అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజు తనతో అత్యంత దారుణంగా, అమానవీయంగా మాట్లాడారని ఆమె ఆరోపిస్తోంది. “నీ కొడుకు చనిపోయాడనుకో, వాడిని చంపేస్తాం” అని సీఐ బెదిరించాడని, అన్నంత పనీ చేసి లాకప్‌లోనే కొట్టి చంపేశారని ఆమె కన్నీరుమున్నీరవుతోంది. “నా బిడ్డ బతికుంటే చూపించండి, లేదంటే చంపేసిన శవాన్ని ఇవ్వండి, చివరకు కాల్చేసి ఉంటే కనీసం ఆ బూడిదైనా ఇవ్వండి.. కర్మకాండలు చేసుకుంటా” అంటూ ఆమె రోదించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఈ వ్యవహారంపై జూన్ 4వ తేదీన బెజవాడ బార్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయపరంగా కీలక మలుపు తిరిగింది. విచారణ సందర్భంగా పోలీసుల తరఫు న్యాయవాది సాయికృష్ణ ఎక్కడున్నాడో తమకు తెలియదని, అతని కోసం గాలిస్తున్నామని కోర్టుకు తెలిపారు. దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు, జూన్ 29వ తేదీ లోగా సాయికృష్ణను తప్పనిసరిగా తమ ఎదుట హాజరుపరచాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
రాజకీయంగా ఈ కేసు మరింత వేడెక్కింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కృష్ణలంకలోని సాయికృష్ణ నివాసానికి వెళ్లి బాధితుడి తల్లిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి సాయికృష్ణను చంపేసి, బూడిద కూడా మిగలకుండా ఆధారాలు మాయం చేశారని వైసిపి నేతలు అంబటి రాంబాబు తదితరులు తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఈ కేసును సీబీఐతో విచారించాలని డిమాండ్ చేశారు. జగన్ పరామర్శ తర్వాతే ప్రభుత్వం ,పోలీసు వ్యవస్థల్లో వేగంగా కదలిక వచ్చింది.
సింగపూర్ పర్యటన ముగించుకుని రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని, సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ చేయించాలని ఆదేశించింది. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తక్షణ చర్యలు తీసుకుంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేశారు. అతని స్థానంలో మురళీకృష్ణను కొత్త సీఐగా నియమించారు.
పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో, బాధితురాలి ఫిర్యాదు మేరకు సస్పెండైన సీఐ నాగరాజుపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా స్పందించి అర్ధరాత్రి వేళ కేసు నమోదు చేయించారు. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో సీఐ నాగరాజుపై హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లతో పాటు బీఎన్‌ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1), బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు మోపారు. ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పైనే ఇలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు కావడం పోలీస్ శాఖలో కలకలం రేపింది.
కేసు దర్యాప్తును పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి) ఎస్పీ నరసింహ కిషోర్‌ను ప్రత్యేక విచారణాధికారిగా నియమించారు. ఆయన విజయవాడకు చేరుకుని డీజీపీ, సీపీలతో భేటీ అయిన అనంతరం నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. దీనితో పాటు దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా రంగంలోకి దిగి సమాంతరంగా విచారణను ముమ్మరం చేసింది.
ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయమే సాయికృష్ణ నివాసానికి వెళ్లి అతని తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, పిన్ని కనకదుర్గలను సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. సాయికృష్ణను మార్కాపురం నుండి తీసుకువచ్చిన దగ్గర నుండి లాకప్‌లో పెట్టి సీఐ నాగరాజు చిత్రహింసలు పెట్టిన విధానం వరకు కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి మాటను అధికారులు క్షుణ్ణంగా నమోదు చేసుకున్నారు.
డిజిటల్ సాక్ష్యాల సేకరణలో భాగంగా దర్యాప్తు బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లు, డీవీఆర్ పరికరాలను సీజ్ చేసింది. ఫోరెన్సిక్, సైబర్ అనాలసిస్ నిపుణులను పిలిపించి, మే నెలకు సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజీని బ్యాకప్ చేయించారు. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకువచ్చిన రాత్రి లోపల ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ డిజిటల్ ఆధారాలను విశ్లేషణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. లాకప్‌లో రక్తం లేదా ఇతర ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో ఫోరెన్సిక్ బృందం నమూనాలను సేకరించింది.
మరోవైపు, పోలీసులు సాయికృష్ణను మార్కాపురం నుండి విజయవాడకు తరలించిన ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని కూడా విచారించారు. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతాకుమారితో పాటు విచారణ బృందం ఎనిమిది మంది కీలక సిబ్బందిని ప్రశ్నించింది. ఇందులో ఎస్సై నవీన్ కుమార్, కానిస్టేబుళ్లు మురళీకృష్ణ, రాంబాబు, క్రైమ్ కానిస్టేబుల్ బాబూరావు, సెంట్రీలు పవన్ కుమార్, హిమజ, సెక్షన్ ఇంచార్జ్ నాగరాజు ఉన్నారు. సాయికృష్ణను తీసుకొచ్చిన తర్వాత ఎవరికి అప్పగించారు, ఎంత సమయం లాకప్‌లో ఉంచారనే దానిపై వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.
సాయికృష్ణ శవాన్ని స్వర్గపురి శ్మశానవాటికలో రహస్యంగా దహనం చేశారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. మే 24, 25 తేదీల్లో జరిగిన గుర్తుతెలియని మృతదేహాల దహనాలపై సిబ్బందిని ఆరా తీశారు. మే 23 రాత్రి శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఫోన్ రికమండేషన్‌తో వచ్చిన రెండు మృతదేహాలను మార్చురీలో ఉంచి, 24న దహనం చేసినట్లు రికార్డుల్లో ఉంది. అయితే అవి 40 ఏళ్లు పైబడిన వారివని, 23 ఏళ్ల యువకుడి దహన వివరాలు లేవని తేలింది. అయినప్పటికీ అనుమానంతో ఎలక్ట్రిక్ దహనాలు చేసే బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని ఫోన్‌ను సీఐ పవన్ కిషోర్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం స్వర్గపురి శ్మశానవాటికలో మే 20 నుండి మే 29 వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు కోరగా, అక్కడ ఇంకా కెమెరాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదని, పాత ఫుటేజీలు ఏవీ అందుబాటులో లేవని సిబ్బంది సమాధానమిచ్చారు. దీనితో శ్మశానవాటికలో భౌతిక ఆధారాల సేకరణ, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలపైనే పోలీసులు ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. విచారణ తుది దశకు చేరుకోవడంతో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు అరెస్ట్ ఖాయమని, అతనితో పాటు సహకరించిన మరికొందరు పోలీసులపై కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని లీకులు వస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ రౌడీషీటర్ అదృశ్యం మిస్టరీని ఛేదించేందుకు ఎస్పీ నరసింహ కిషోర్, ఏసీపీ దైవ ప్రసాద్ బృందాలు అన్ని కోణాల్లోనూ వేగంగా అడుగులు వేస్తున్నాయి. హైకోర్టు విధించిన జూన్ 29 గడువు సమీపిస్తుండటంతో, ఆలోగా సాయికృష్ణ ఆచూకీ లభ్యమవుతుందా, లేదా లాకప్ డెత్ నిజమేనని తేలి మరికొందరు ఖాకీలపై చర్యలు ఉంటాయా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. దర్యాప్తులో తేలే నిజా నిజాల కోసం ప్రజలు, రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.









