neet re exam paper

NEET Re-Exam : నీట్ యూజీ–2026 పేపర్ లీకేజీ తరువాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిన్న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించింది. ఎగ్జామ్ అంతా ప్రశాంతంగా ముగిసింది. అయితే నీట్ యూజీ–2026తో పోలిస్తే రీఎగ్జామ్ రాసేందుకు అభ్యర్ధులు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మొదటి విడత పరీక్షతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల హాజరు శాతం తగ్గిపోయింది. తెలంగాణలో 208 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు సగటున 89.09 శాతం మంది మాత్రమే హాజరయ్యారు.

రాష్ట్రంలో నీట్ రీఎగ్జామ్ కోసం మొత్తం 73,059 మంది రిజిస్టర్ చేసుకోగా, 65,087 మంది పరీక్షకు హాజరయ్యారు. మిగతా 7,972 మంది హాజరు కాలేదు, ఇక దేశవ్యాప్తంగా ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే.. మొత్తం 22,74,702 మంది అభ్యర్థులకుగాను 19,95,527 మంది పరీక్షకు హాజరయ్యారు. సుమారు 2.79 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు దూరంగా ఉన్నారు. దీంతో హాజరు శాతం 87.7శాతానికి పరిమితం అయింది. రద్దైన పరీక్షకు 22,75,011 మంది రిజిస్టర్ చేసుకోగా, 22,05, 035 మంది హాజరయ్యారు. అంటే.. 96.92 శాతం మంది మాత్రమే గైర్హజరయ్యారు. గతంలో పోలిస్తే.. ఈ సారి ఏకంగా 9.22 శాతం హాజరు తగ్గింది.

విద్యార్థులకు గట్టి పరీక్షే

రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రం ఈసారి విద్యార్థులకు గట్టి పరీక్షే పెట్టింది. సబ్జెక్ట్ నిపుణులు, అభ్యర్థుల విశ్లేషణ ప్రకారం.. ఓవరాల్‌గా ప్రశ్నపత్రం టఫ్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫిజిక్స్ విభాగం విద్యార్థులకు చుక్కలు చూపించింది. దాదాపు 60 నుంచి 70 శాతం ప్రశ్నలు సుదీర్ఘమైన గణిత లెక్కలు అప్లికేషన్ ఆధారితంగా రావడంతో వాటిని పూర్తి చేయడానికి సమయం సరిపోలేదని అభ్యర్థులు వాపోయారు. అటు కెమిస్ట్రీ లో కూడా అసెర్షన్-రీజనింగ్ తరహా ప్రశ్నలు చాలా ట్రిక్కీగా రావడంతో సమాధానాలు గుర్తించడానికి విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.

అయితే, బయాలజీ విభాగం మాత్రం విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చింది. బోటనీ, జూవాలజీ ప్రశ్నలు పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచే నేరుగా రావడంతో ఇందులో మంచి స్కోర్ సాధించడం సులభమని నిపుణులు చెబుతున్నారు. ఈ రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రైమరీ కీ జూన్ 28న విడుదల కానుండగా, తుది ఫలితాలు జులై చివరి వారంలో వెలువడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.