elnino

El Nino:  పస్ ఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఎల్ నినో వాతావరణ మార్పు, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఆర్థిక సవాలుగా మారబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, అంటే కేవలం 90 శాతమే నమోదయ్యే అవకాశం ఉంది. గత మూడేళ్లలో ఇంత తక్కువ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి కానుంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర దాటకుండా మధ్యలోనే నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా వానల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జూన్ మొదటి రెండు వారాల్లో సాధారణంగా కురవాల్సిన 72.2 మిమీ వానలకు గాను కేవలం 42.6 మిమీ మాత్రమే కురిసింది. అంటే దేశంలో అప్పుడే 41 శాతం వర్షాల కొరత ఏర్పడింది. ముఖ్యంగా మధ్య ఇండియాలో 67 శాతం, తూర్పు-ఈశాన్య రాష్ట్రాల్లో 42 శాతం తక్కువ వానలు పడ్డాయి. మన దేశంలో ఇప్పటికీ దాదాపు 46 శాతం మంది ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోతే ఉత్తరప్రదేశ్, తమిళనాడుతో సహా దాదాపు 12 రాష్ట్రాలపై ఈ ఎల్ నినో ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది.

అంతర్జాతీయ శాస్త్రవేత్తల హెచ్చరికలు మన తెలుగు రాష్ట్రాలను కూడా కలవరపెడుతున్నాయి. ప్రస్తుతానికి జూన్ నెలలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నట్లు అనిపించినప్పటికీ, రాబోయే రోజుల్లో ఈ ఎల్ నినో ముప్పు తెలుగు రాష్ట్రాలపై గట్టిగినే పడనుంది. రుతుపవనాలు ప్రారంభంలో పర్వాలేదనిపించినా, రాబోయే జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్ నినో తీవ్రత పెరిగేకొద్దీ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. చాలా జిల్లాల్లో సకాలంలో వానలు పడక, కరువు పరిస్థితులు తలెత్తే ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్రా, రాయలసీమతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు విపరీతమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. వర్షాకాలం నడవాల్సిన సమయంలో కూడా ఎండలు మండిపోవడం, ఉక్కపోత ఎక్కువగా ఉండటం వంటి విచిత్రమైన పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

అసలు ఎల్ నినో అంటే

పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉపరితలం అసాధారణంగా వేడెక్కడం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారిపోయి మన దేశంలో కరువు పరిస్థితులు వస్తాయి. చరిత్రను చూస్తే, 1950 నుండి ఇప్పటివరకు వచ్చిన 16 ఎల్ నినో ఏళ్లలో 7 సార్లు దేశంలో తీవ్రమైన వర్షాల కొరత ఏర్పడింది. ఈసారి శాస్త్రవేత్తలు సూపర్ ఎల్ నినో వచ్చే అవకాశం కూడా ఉందని, గత 140 ఏళ్లలోనే ఇది అత్యంత బలమైనదిగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల కంటే ఆహార పదార్థాల ధరల గురిచే నిపుణులు ఎక్కువగా భయపడుతున్నారు. వర్షాలు లేక పంటలు దెబ్బతింటే వంటగది బడ్జెట్ తలకిందులవుతుంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన RBI వచ్చే ఆర్థిక సంవత్సరానికి (FY27) తన ద్రవ్యోల్బణం అంచనాను 4.6 శాతం నుండి ఏకంగా 5.1 శాతానికి పెంచేసింది. ఇప్పటికే మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.9 శాతానికి చేరింది. ఎండ తీవ్రత, వానలు లేకపోవడంతో మార్కెట్‌లో టమాటాలు, పచ్చిమిర్చి, క్యాబేజీ ధరలు అప్పుడే పెరగడం మొదలైంది. ముఖ్యంగా ఎల్ నినో కారణంగా రాబోయే రోజుల్లో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతాయని ఎస్‌బీఐ రీసెర్చ్ స్పష్టం చేసింది. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు సామాన్యుడి జేబుకు పెద్ద చిల్లు పెట్టబోతున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.