
Ketan Agarwal : పూణేకు చెందిన బిజినెస్ మెన్ కేతన్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న అసలు నిజాన్ని అతని సోదరి అనుమానమే బయటపెట్టింది. కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి ఆడిన క్రూరమైన హత్య నాటకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జూన్ 18న లొహగాడ్ కోటలో సియాతో కలిసి ట్రెకింగ్ కు వెళ్లిన కేతన్, అక్కడ లోయలో పడి చనిపోయాడు. మొదట్లో లోనావాలా రూరల్ పోలీసులు దీనిని కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించి కేసు నమోదు చేశారు.
అయితే, కేతన్ మరణాన్ని అతని సోదరి మాత్రం ప్రమాదంగా నమ్మలేదు. తమ్ముడి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కూడా ఆమె మనసులో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు తొలిచేశాయి. ఈ క్రమంలోనే, ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సియా గోయల్.. కేతన్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వారి ఇంటికి వచ్చింది. ఆ సమయంలో కేతన్ సోదరి లొహగాడ్ కోట వద్ద ఏం జరిగిందో చెప్పాలని సియాను వివరంగా అడిగారు.
మే 31, జూన్ 14, జూన్ 18 తేదీల్లో కేతన్, సియా ఇద్దరూ కలిసి మూడుసార్లు ఆ కోట వద్దకు వెళ్లినట్లు తేలింది. సోదరి అడిగిన ప్రశ్నలకు సియా పొంతన లేని సమాధానాలు చెప్పడం, తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో సోదరి అనుమానం మరింత బలపడింది. దీనితో కుటుంబ సభ్యులంతా కలిసి పోలీసులను ఆశ్రయించి, మళ్లీ విచారణ జరపాలని కోరారు.
కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్ ఆధారాలను పరిశీలించడం ప్రారంభించారు. ఈ విచారణలో సియా గోయల్‌కు, చేతన్ చౌదరి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. సియాకు మరొకరితో సంబంధం ఉన్న విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసినా, పెళ్లి తర్వాత అంతా సర్దుకుంటుందని చెప్పి కేతన్‌తో పెళ్లి నిశ్చయించారని కేతన్ కుటుంబం ఆరోపించింది.
పోలీసులు లొహగాడ్ కోట పరిసరాల్లోని సీసీటీవీలను తనిఖీ చేయగా, జూన్ నెల ఎండల్లో కూడా ఒక వ్యక్తి హుడీ వేసుకుని కేతన్, సియా ప్రయాణించిన వాహనాన్ని, వారి కదలికలను గమనిస్తూ ఫాలో అయినట్లు గుర్తించారు. ఎండకాలంలో అలాంటి దుస్తులు వేసుకోవడం అనుమానంగా అనిపించడంతో పోలీసులు అతనిపై దృష్టి పెట్టి, ఆ వ్యక్తి ప్రియుడు చేతన్ చౌదరిగా గుర్తించారు. ఆ రోజు జరిగిన ఘటనపై సియా చెప్పిన మాటల్లో కూడా చాలా తప్పులు దొర్లడంతో పోలీసులు సియా, చేతన్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు.
Also Read : ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో త్రిష ఫొటో ఉండాల్సిందే.. కౌన్సిలర్ డిమాండ్!
పొంతన లేని సమాధానాలు
మొదట వారిద్దరూ పొంతన లేని సమాధానాలు చెప్పినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని తేలింది. సియా, చేతన్ గత మూడేళ్లుగా పరిచయంలో ఉన్నారని.. ఈ ఏడాది జనవరి నుండి జూన్ మధ్య కాలంలోనే వీరిద్దరూ 2,004 సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారని, దాదాపు 238 గంటల సమయం కాల్స్ మాట్లాడారని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఫేస్‌టైమ్, వాట్సాప్ కాల్స్ ద్వారా కూడా నిరంతరం టచ్‌లో ఉన్నట్లు ఆధారాలు దొరికాయి.
ఫొటోలకు ఫోజులు ఇస్తూ కేతన్ కాలుజారి లోయలో పడిపోయాడని మొదట సియా నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, సియా ఆమె ప్రియుడు చేతన్ ఇద్దరూ కలిసి కేతన్‌ను పైనుంచి లోయలోకి తోసేసి, ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసులు స్పష్టం చేశారు. జూన్ 23న పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలను అరెస్ట్ చేశారు. ఈ క్రూరమైన కుట్రలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : ఒక్క నిమిషం లేటైతే.. గంట ఫ్రీగా పని చేయాలి : కంపెనీ దిక్కుమాలిన రూల్!









