
SIR: ఏపీ వ్యాప్తంగా సర్ ప్రక్రియ ముగిసింది. అయితే ఎన్యూమరేషన్ ప్రక్రియలో వివరాలు లభించని కారణంతో ఏకంగా 44,71,523 ఓట్లు తొలగించాల్సిన జాబితాలోకి చేరిపోయాయి. ఈ ఎన్యూమరేషన్ పత్రాలను ఎన్నికల సంఘం అధికారులు అన్కలెక్టబుల్గా భావిస్తున్నారు. ఈ నెల 31న ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేయబోయే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ 44.7 లక్షల మంది ఓటర్ల పేర్లు కనిపించవు. వీరి వివరాలను ప్రత్యేకంగా ఏఎస్డీడీ (ASDD – అన్ట్రేస్బుల్/ఆబ్సెంట్స్, పర్మినెంట్లీ షిఫ్టెడ్, డెత్స్, డబుల్ ఎంట్రీ) జాబితాలో వేరుగా విడుదల చేస్తారు. అయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, వివరాల సేకరణ, వాటి డిజిటైజేషన్ ప్రక్రియ గడువు ఇటీవల ముగిసింది. రాష్ట్రంలో మొత్తం ఉన్న 4,16,27,694 ఓటర్లకు గాను 3,71,56,171 మంది వివరాలు మాత్రమే సక్సెఫుల్గా డిజిటైజ్ అయ్యాయి. అయితే ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలలో రకరకాల లోపాలు, తప్పులు ఉండటం వల్ల మరొక 8,55,560 మంది ఓటర్లను ‘నో మ్యాపింగ్’ విభాగంలో ఉంచారు. ముసాయిదా జాబితా ప్రచురించిన తర్వాత వీరందరికీ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసులు అందుకున్న వారు ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పించి తమ ఓటును రీ-మ్యాపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఈ ఓట్లను కూడా పూర్తిగా రద్దు చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా తొలగింపు ముప్పులో ఉన్న ఈ 44.7 లక్షల ఓట్లలో దాదాపు 29.07 శాతం (13 లక్షలకు పైగా) ఓట్లు కేవలం ఐదు జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే 2,90,579 ఓట్లు తొలగింపు జాబితాలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో తిరుపతి (2,87,759), కడప (2,44,879), విశాఖపట్నం (2,39,146), గుంటూరు (2,37,789) జిల్లాలు ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్రంలోని మరో 18 జిల్లాల్లో లక్షకు పైగా ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి. అయితే ఇచ్చిన అడ్రస్ ప్రకారం నివాసం ఉండని లేదా వివరాలు లభ్యం కాని వారు 7.76 లక్షలు (1.87%), ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారు 14.34 లక్షలు (3.45%), మరణించిన వారు 15.19 లక్షలు (3.65%), రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న డబుల్ ఎంట్రీలు 7.32 లక్షలు (1.76%) ఉన్నారు. తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి బాధితులకు ఎన్నికల సంఘం ఒక అవకాశం కల్పించింది. జులై 31న డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చాక ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ జరిపి సమాచారం సరిగ్గా ఉంటే అక్టోబర్ 3న వచ్చే తుది జాబితాలో ఓటును పునరుద్ధరిస్తారు. లేదంటే ఆ పేర్లను శాశ్వతంగా తొలగిస్తారు.









