
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించిన నటుడు రమేష్ తీవ్ర అనారోగ్యం కారణంగా హాస్పిటల్ బెడ్‌పై చికిత్స పొందుతున్నాడు. తాజాగా ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను చాటుకున్నారు. రమేష్ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం.. ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. భారీగా ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా రమేష్‌కి చికిత్స అందిస్తున్న డాక్టర్‌తో మాట్లాడి.. అన్ని వివరాలు తెలుసుకున్నారు. చిరు చేసిన ఈ పనికి నెట్టింట ప్రశంసలు అందుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
‘గబ్బర్ సింగ్’ సినిమాలో పోలీస్ స్టేషన్ అంతాక్షరి సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సీన్ సినిమాకే హైలైట్. అందులో రౌడీ గ్యాంగ్ సభ్యుడిగా నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు నమేష్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సడెన్‌గా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అతడిని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తక్షణమే స్పందించారు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులను, సినీ కార్మికులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్.. రమేష్ కుటుంబాన్ని ఆదుకున్నారు. రమేష్ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రూ. 3లక్షల చెక్కును ఆయన భార్యకు అందజేశారు. అంతేకాకుండా అపోలో హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ సుబ్బారెడ్డితో స్వయంగా మాట్లాడి.. రమేష్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని హాస్పిటల్ సిబ్బందిని కోరారు.
అక్కడితో ఆగకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా అవసరమైన సహాయం అందేలా కూడా సహాయపడతానని మెగాస్టార్ భరోసా ఇచ్చారు. చిరంజీవి చూపిన ఉదారతకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉంటే చిరు సోదరుడు నాగబాబు కూడా రమేష్ అనారోగ్యంపై స్పందించారు. ఈ మేరకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.









