
Saudi Arabia : ప్రపంచంలోనే అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే వ్యాపార సముద్ర మార్గాలలో నావికా భద్రతను పెంపొందించేందుకు సౌదీ అరేబియా ఒక చారిత్రాత్మక రక్షణ కూటమిని ప్రకటించింది. బాబ్ అల్-మందేబ్ జలసంధి, ఎర్రసముద్రం, ఆడెన్ సింధుశాఖ వంటి వ్యూహాత్మక జలమార్గాలలో ప్రయాణించే వాణిజ్య నౌకల ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి ఈ భారీ నావికాదళ కూటమిని ఏర్పాటు చేశారు. సౌదీ అరేబియాతో పాటు మరో 13 దేశాలు భాగస్వాములుగా చేరినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది.
ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో చేపడుతున్న దాడులు, నావికా దిగ్బంధం విధించే ప్రయత్నాల వల్ల అంతర్జాతీయ సముద్ర రవాణాకు తీవ్ర విఘాతం కలిగింది. దీనికి తోడు హోర్ముజ్ జలసంధి వద్ద సరఫరాలు నిలిచిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతపై ఆందోళనలు వ్యక్తమై, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల వైపు దూసుకెళ్లాయి. ఈ తీవ్ర ప్రతికూల పరిణామాలను తిప్పికొట్టేందుకే ఈ భద్రతా కూటమి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ అంతర్జాతీయ రక్షణ కూటమిలో సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్, ఖతార్, పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, బంగ్లాదేశ్, నైజీరియా, సూడాన్, జిబౌటీ,సోమాలియా వ్యవస్థాపక సభ్య దేశాలుగా ఉన్నాయి. రియాద్‌లో నిర్వహించిన కీలక సైనిక సదస్సులో ఈ ఒప్పందానికి తుది రూపం ఇచ్చారు. ఈ సమావేశంలో 43 దేశాల సైనిక అధిపతులు, ప్రతినిధులతో పాటు యూరోపియన్ యూనియన్ (EU) ప్రతినిధులు కూడా ప్రత్యక్షంగా,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
Also Read : షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తే వెంటనే అరెస్ట్ చేస్తాం : బంగ్లాదేశ్ మంత్రి
Saudi Arabia hosted the first meeting of the 12-nation Maritime Defence Alliance.
The alliance seeks to safeguard navigation and secure the Red Sea and Bab el-Mandeb through closer military and security coordination.
🇸🇦 🇺🇸 🇾🇪 🇴🇲 🇧🇭 🇸🇩 🇰🇼 🇯🇴 🇲🇦 🇧🇩 🇳🇿 🇲🇻 pic.twitter.com/S1Am2Mq1Yv
— Salman Al-Ansari | سلمان الأنصاري (@Salansar1) July 30, 2026
ఈ కూటమికి సౌదీ అరేబియా నాయకత్వం వహించడమే కాకుండా, తన సొంత భూభాగంలోనే ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. నావికాదళ కార్యకలాపాలు సమర్థవంతంగా జరిగేందుకు ఒక ఉమ్మడి కమాండ్ స్ట్రక్చర్, ఆపరేషనల్ కంట్రోల్ హబ్, జనరల్ సెక్రటేరియట్లను నెలకొల్పుతున్నారు. సభ్య దేశాల అంతర్గత చట్టపరమైన అనుమతులు పూర్తయిన తర్వాత మరిన్ని దేశాలు కూడా ఈ భద్రతా కూటమిలో చేరడానికి సౌదీ అనుమతించింది.
ఈ కొత్త సైనిక కూటమిని పూర్తి రక్షణాత్మక చొరవగా సౌదీ రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఈ కూటమి ఏ ఒక్క నిర్దిష్ట దేశాన్ని లేదా సంస్థను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసింది కాదని, ప్రతి సభ్య దేశం సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ, అంతర్జాతీయ చట్టాల నిబంధనలకు లోబడి మాత్రమే కార్యకలాపాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆసియా, ఐరోపా మార్కెట్లకు వెళ్లే ఇంధన నౌకలకు భద్రత కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
Also Read : ఇరాన్ పై బాంబుల వర్షం… క్షిపణి దాడులతో వణికిపోతున్న టెహ్రాన్
ఎర్ర సముద్రంలో ఈ బహుళజాతి నావికాదళ రక్షణ కూటమి ఏర్పాటు ప్రతిపాదనతో గురువారం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ధరలు తగ్గుముఖం పట్టాయి. నౌకా దిగ్బంధనం, సరఫరా అంతరాయాల భయాలను తగ్గించేలా భద్రతా చర్యలు ఉండటంతో మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా మారింది. కీలకమైన జలసంధుల వద్ద భద్రత పెరగడం వల్ల ఇంధన రవాణా ఖర్చులు, డెలివరీ ఆలస్యాలు తగ్గుతాయని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.
ప్రాంతీయంగా ఈజిప్ట్, రష్యా, సౌదీ అరేబియాలలో ఇంధన మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడుల నివేదికల వల్ల అంతర్జాతీయంగా కొంత అస్థిరత కొనసాగుతున్నప్పటికీ, కొత్త కూటమి ఆగమనం ఊరటనిచ్చింది. మరోవైపు ఒమన్, ఇరాన్ మధ్య హార్ముజ్ జలసంధి గుండా రవాణాను సజావుగా నిర్వహించడంపై కొనసాగుతున్న దౌత్య చర్చలు కూడా ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
సముద్ర మార్గాల్లో భద్రతను అధికారికంగా బలోపేతం చేయడం ద్వారా, సరఫరా గొలుసులకు ఏర్పడే నష్టాలను తగ్గించడానికి , ఇంధన ఖర్చులలో ఆకస్మిక పెరుగుదలను నివారించడానికి ఈ కూటమి ప్రయత్నిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ నావికాదళ భద్రతా చర్యల పురోగతి ,దౌత్య చర్చల ఫలితాలు స్వల్పకాలిక చమురు ధరల ధోరణులను, ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని శాసించనున్నాయి.









