
Bhogapuram Airport : దశాబ్దాల నిరీక్షణ.. ఎన్నో ఏళ్ల కల.. ఎట్టకేలకు ఉత్తరాంధ్ర నేలపై ఆవిష్కృతం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్లతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని’ ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరోవైపు రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల వరదతో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారబోతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్లతో నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్నిశనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు వేదికను పంచుకోనున్నారు.విమానాశ్రయ ప్రారంభోత్సవంతో పాటు రాష్ట్రంలో మొత్తం రూ.17,912 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల విశాఖతో పాటు పరిసర జిల్లాల్లో పర్యాటక, పారిశ్రామిక, రవాణా రంగాలు ఊపందుకోనున్నాయి. దీనికి తోడుగా విశాఖ జిల్లా తర్లువాడ వద్ద రూ.468 కోట్లతో నిర్మించనున్న ‘ఏఎస్ఐపీ సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టెస్టింగ్ ఫెసిలిటీ (ఫేజ్-1)’ శంకుస్థాపన ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో నూతన అధ్యాయం మొదలు కానుంది.
Also Read : జంతర్‌మంతర్ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర ఆగ్రహం: ‘జెన్-జీ’ తీరుపై అసంతృప్తి
కర్నూలు సోలార్,విండ్ ఎనర్జీ జోన్ (రూ.3,547 కోట్లు), అనంతపురం, కర్నూలు పరిధిలోని సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ స్కీమ్ (రూ.823 కోట్లు)ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే: రూ.763 కోట్ల వ్యయంతో పూర్తయిన ప్యాకేజీ-4 (రేచర్ల – గుర్వాయగూడెం) లోకార్పణతో పాటు రూ.933 కోట్లతో చేపట్టే ప్యాకేజీ-5 (గుర్వాయగూడెం – దేవరాపల్లి) కి శ్రీకారం చుట్టనున్నారు.రూ.160 కోట్లతో ఎన్ హెచ్-67 తాడిపత్రి బైపాస్ 4-లేన్ల రహదారి నిర్మాణం చేపడుతారు. పెంచలకోన వద్ద లో-లెవెల్ వంతెన స్థానంలో రూ.27 కోట్లతో హై-లెవెల్ వంతెన నిర్మాణ శంకుస్థాపన. ఈ భారీ ప్రాజెక్టుల సముదాయం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిని పరుగులు తీస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసే అద్భుత ఘట్టానికి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సిద్దమవుతోంది. ఇది కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు. ఈ ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక విప్లవానికి ఒక బలమైన పునాది. ఈ ప్రాజెక్ట్ సాకారమవుతుండటంతో వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక యువతలో ఆనందం వ్యక్తమౌతోంది.ఎన్నో ఏళ్లుగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వలస వెళ్తున్న ఉత్తరాంధ్ర యువతకు ఇప్పుడు స్వగ్రామంలోనే బంగారు భవిష్యత్తు లభించనుందనే ఆశలు నెలకొన్నాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం గ్లోబల్ మ్యాప్‌లో ప్రముఖ స్థానం సంపాదించుకుంటుంది. ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఏరోస్పేస్, ఏవియేషన్ పరిశ్రమలతో పాటు లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విమానాశ్రయ నిర్మాణంతో పాటు ఇక్కడ హోటళ్లు, రిసార్ట్లు, ఆతిథ్య రంగాలు విస్తరిస్తాయి. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఉన్న తీరప్రాంతం (బీచ్ రోడ్) అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుంది. దీనివల్ల పర్యాటక రంగం ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.
ఇప్పటివరకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లడం సర్వసాధారణంగా జరిగేది. అయితే, భోగాపురం ఎయిర్పోర్ట్ , దాని చుట్టూ ఏర్పడబోయే పారిశ్రామిక కారిడార్ల కారణంగా ఈ వలసల ప్రవాహానికి పూర్తిగా అడ్డుకట్ట పడనుంది. అంతేకాకుండా, దేశ విదేశాల నుంచి పేరుమోసిన కంపెనీలు, నిపుణులు ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకాశం ఉంది. దీనివల్ల వలస వెళ్లిన వారు తిరిగి వెనక్కి రావడంతో పాటు, ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వలస వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఆరోగ్య సేవలు, విద్య వంటి రంగాలు కూడా ఊహించని రీతిలో అభివృద్ధి చెంది, ఉత్తరాంధ్ర యువతకు స్థానికంగానే ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్న సాకారానికి, ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలవనుంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధికి దోహదపడుతోందని జనవిజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజి అన్నారు. ఈ విమానాశ్రయ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో వసతి, రవాణా సౌకర్యాలతో పాటు అనేక కొత్త ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పైడిభీమవరం, భోగాపురం పరిసర ప్రాంతాలలో ఇప్పటికే ఉన్న ఫార్మా, కెమికల్, జూట్, రైస్ మిల్లులు తదితర వందలాది పరిశ్రమలన్నింటికీ ఇది ఒక కేంద్ర బిందువుగా మారుతుందని, భవిష్యత్తులో ఈ జిల్లాలలో మరిన్ని పరిశ్రమలు విస్తరించడానికి అద్భుతమైన అవకాశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎయిర్పోర్ట్న ద్వారా ఈ ప్రాంతం ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే డ్రోన్ టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకు తగ్గట్టుగా యూనివర్సిటీ కోర్సులను మరింత మెరుగు పెట్టి, యువత ఉద్యోగాలను తీర్చి దిద్దనున్నారు. ఈ ఏడాది కొత్తగా ‘ఏరోస్పేస్ అండ్ డ్రోన్ టెక్నాలజీ’ బీటెక్ కోర్సును ప్రవేశ పెట్టబోతున్నారు.ఈ విమానాశ్రయంతో యువతకి ఎంతో ఉపాధి కలుగుతుంది. ఇక్కడి నుంచి ఎగుమతులు, దిగుమతులు మొదలై ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఎయిర్పోర్ట్ సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ. 4,592 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఇక్కడ అన్ని రకాల వసతులను కల్పించారు.3,800 మీటర్ల పొడవైన ‘కోడ్-ఇ’ (Code-E) రన్‌వేను నిర్మించారు. ఇది భారీ వైడ్-బాడీ అంతర్జాతీయ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు, టేకాఫ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.ఎగుమతులు, దిగుమతులను వేగవంతం చేసేందుకు 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక కార్గో టెర్మినల్‌ను అందుబాటులోకి రానుంది.ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, సమాంతర టాక్సీవేలు, ఫ్యూయల్ హైడ్రెంట్ సిస్టమ్ వంటి అధునాతన సాంకేతిక వ్యవస్థలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు (MPPA) సేవలందించేలా సిద్ధమైంది. అయితే, భవిష్యత్తులో విమాన ప్రయాణికుల రద్దీని ఊహించి, దశలవారీగా దీనిని ఏటా 4 కోట్ల మందికి పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం వరకు విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు.దానికి అనుగుణంగా మొదటి దశ పనులను పూర్తి చేశారు.
ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణాలకే పరిమితం కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వనుంది. రాకపోకలు సులభతరం కావడంతో పెట్టుబడులు పెరగడమే కాకుండా, స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా భారీగా మెరుగుపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్దికి ఇది గ్రోత్ ఇంజన్ అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఈ విమానాశ్రయం కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు ఇది ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక వృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల సృష్టికి ఒక తిరుగులేని వారధిగా నిలవనుంది. ఈ ఎయిర్‌పోర్టుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఏరోడ్రోమ్ లైసెన్స్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆమోదాలు, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్, కస్టమ్స్ నోటిఫికేషన్లు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుండి క్లియరెన్స్‌లు జారీ అయ్యాయి.భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని సరిహద్దు జిల్లాల ప్రజలకు ప్రధాన విమానయాన మార్గంగా మారుతుంది.ప్రయాణీకులు సులభంగా విమానాశ్రయానికి చేరుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖపట్నం నుంచి ఇప్పటికే 7 అప్రోచ్ రోడ్లతో కూడిన అధునాతన హైవే కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చాయి. ఇతర జిల్లాలనుంచి కూడా అనుసంధానానికి ప్రణాళికలను రూపొందించారు. ఇన్నాళ్ళూ వెనుకబడ్డ జిల్లాగా ముద్ర పడ్డ విజయనగరం జిల్లా ఆ ముద్రను తుడిచేసుకుని, రాష్ట్రానికి వెన్నుముక జిల్లాగా మారేందుకు భోగాపురం విమానాశ్రయం సరికొత్త బాటను వేస్తుందనడంలో సందేహం లేదు అంటున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు.
Also Read : పేరు మార్చేసిన ఆ ఒక్క ‘పావలా’ నాటిక.. సీనియర్ నటి శ్యామల లైఫ్ చేంజింగ్ స్టోరీ!
ప్రత్యేకతలు
రన్‌వే: ఎయిర్‌బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో ‘క్యాట్-ఐ’ రన్‌వేను సిద్ధం చేశారు.
టెర్మినల్ భవనం: సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, రెండు అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్‌ను నిర్మించారు. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉండగా, రాబోయే రోజుల్లో 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు.
ప్రత్యేక డిజైన్: ఈ విమానాశ్రయ నిర్మాణం తీర ప్రాంత విశిష్టతను చాటేలా ‘ఎగిరే చేప’ ఆకృతిలో ప్రేరణ పొందింది. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ ‘ట్రిగ్రామ్’ థీమ్ ఆర్ట్‌తో ఆకట్టుకునేలా ఉంది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC): 55 మీటర్ల ఎత్తులో, 360 డిగ్రీల విహంగ వీక్షణ సేవలు అందించేలా ఎంటీసీ టవర్‌ను ఏర్పాటు చేశారు.
కార్గో సేవలు: దాదాపు 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన కార్గో టెర్మినల్ ద్వారా వార్షికంగా 25,000 టన్నుల వస్తువులను నిర్వహించవచ్చు.
అత్యాధునిక సౌకర్యాలు:
సులభతర ప్రయాణం కోసం 40 చెక్-ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర పాడ్స్, సెల్ఫ్-సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి.
భద్రత కోసం అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమ్మిగ్రేషన్, ఎమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల షాపింగ్, వినోదం కోసం కమర్షియల్ స్పేస్‌లు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు కొలువుదీరన్నాయి.
తుఫానులను సైతం తట్టుకునేలా గంటకు 275 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులను సైతం నిరోధించే సైక్లోన్-రెసిస్టెంట్ డిజైన్‌తో దీన్ని నిర్మించారు
ఉద్యోగ, ఉపాధి రంగానికి అవకాశం
విమానాశ్రయంతో పాటు జీఎంఆర్ ఏరో సిటీ పరిధిలో హోటళ్లు, వాణిజ్య కేంద్రాలు, వినోద జోన్లు రూపుదిద్దుకుంటున్నాయి. అలాగే ఏవియేషన్, ఏరోస్పేస్ రంగానికి ప్రత్యేకంగా 500 ఎకరాలు కేటాయించగా, భీమిలి మండలం అన్నవరంలో జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీ ద్వారా పైలట్లు, ఏరోస్పేస్ ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్థానిక యువత ఉపాధి కోసం వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి.









