Donald Trump :  ఇరాన్‌తో త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న షరతుపై ఆ దేశంపై జరగాల్సిన దాడులను రద్దు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్‌లో డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ చేస్తూ.. వేగంగా ఒక ‘ఒప్పందం’ కుదుర్చుకునే వీలున్నందున తాను ఆ దాడిని రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందంలో హుర్ముజ్ జలసంధిని వెంటనే తెరవడం, ఇరాన్ అణు ముప్పునకు స్వస్తి చెప్పడం వంటి అంశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. వారాంతంలో ఇరాన్‌పై అమెరికా మరింత తీవ్రమైన కొత్త దాడులు చేసే అవకాశం ఉందని యూఎస్ మీడియాలో వార్తలు వచ్చిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని టెహ్రాన్ గతంలో ఆరోపించింది. వాషింగ్టన్‌తో సహకరించే ఏ ప్రాంతీయ దేశమైనా “యుద్ధ మంటల్లో చిక్కుకుంటుందని” హెచ్చరించింది.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా పూర్తి సన్నద్ధంగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని విధంగా సైనిక శక్తిని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఒప్పందం కుదుర్చుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని ఇరాన్ మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలు తనను కోరడంతోనే తాను ఈ దాడులను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.

ఒప్పందానికి సంబంధించి కొంత పురోగతి సాధించినట్లు ఆయన సూచిస్తూ.. ఒక ఒప్పందానికి సంబంధించిన పరిమితులపై అంగీకారం కుదిరిందని చెప్పారు. హుర్ముజ్ జలసంధి తక్షణమే, పూర్తిగా తెరవబడటంతో పాటు ఇరాన్ అణు ముప్పునకు ముగింపు పలకడం ఈ ఒప్పందంలో భాగమని ఆయన రాశారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ఇప్పటివరకు ఎటువంటి స్పందన తెలపలేదు.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని, అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఉన్న అమెరికన్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విమానాలు రద్దయ్యే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని శనివారం జారీ చేసిన భద్రతా హెచ్చరికలో పేర్కొన్నారు. ఇరాన్‌లోని ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యాలపై బాంబు దాడికి అమెరికా, ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు అమెరికాలో బీబీసీ మీడియా భాగస్వామి అయిన సీబీఎస్ న్యూస్‌కు పలు వర్గాలు తెలిపాయి. శుక్రవారం జరిగిన ట్రంప్ క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రణాళిక చర్చకు వచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.