donald Trump

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇటీవల వరుసగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఆయనను ఒక వైపు సాయుధాలు వెంటాడుతుంటే మరోవైపు ప్రమాదాలు కూడా వదలడం లేదు. తాజాగా మరోసారి త్రుటిలో ప్రమాదం తప్పింది. ట్రంప్‌ ప్రయాణిస్తున్న మెరైన్ వన్ హెలికాప్టర్ ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానానికి అతి సమీపానికి వెళ్లడం కలకలం రేపింది. ఆ సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌లో ట్రంప్ ఉండటం.. ఇంకోవైపు ప్యాసింజర్ విమానం కావడంతో ఒక దశలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

అమెరికా రాజధాని నగరం గగనతలంలో ఈ సంఘటనలో హెలికాప్టర్‌, విమానం ఒక మైలుకంటే తక్కువదూరంలోకి వచ్చాయి. అమెరికా సమయం ప్రకారం ఆగస్టు నాలుగో తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌ట్రాఫిక్ సిబ్బందితో కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్లే ఇలా జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. దీన్ని గమనించిన సిబ్బంది వెంటనే రెండింటి మధ్య నిర్దేశిత దూరం చాలా తక్కువగా ఉందని గుర్తించిన ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే పైలట్లను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. దాంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. విమానయాన నిబంధనల ప్రకారం రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ మధ్య దూరం కనీసం మైలున్నర ఉండాలని అధికారులు వెల్లడించారు.

కాగా ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, అమెరికా విమానయాన నియంత్రణాసంస్థ (FAA)లు వెంటనే దర్యాప్తు చేపట్టాయి. ఈ విషయమై సమీక్ష జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఏఏ వెల్లడించింది. ఇదే విషయమై వైట్‌హౌస్‌ కూడా స్పందించింది. మెరైన్ వన్ హెలికాప్టర్లను అత్యంత ప్రతిభావంతులైన శిక్షణ పొందిన పైలట్లు నడుపుతారని, ఈ ఘటనలో అధ్యక్షుడు ట్రంప్‌ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని వెల్లడించింది. కాగా, ఆ సమయంలో ట్రంప్ కాలిఫోర్నియాకు ప్రయాణిస్తున్నారు.

Also Read : పీక్స్ కు చేరిన ట్రంప్ పిచ్చి చేష్టలు.. సొంత సైన్యంపై దాడులు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?

ట్రంప్‌ పర్యటనకు ముందు.సాయుధుడి కలకలం

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ లాస్‌ ఏంజెలెస్‌లో పర్యటించిన సమయంలో ఆయన పర్యటనకు ముందు స్థానిక నేషనల్ గోల్ఫ్‌ కోర్స్‌ వద్ద గందరగోళం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. నిధుల సేకరణ కార్యక్రమం కోసం ట్రంప్ ఈ గోల్ఫ్ కోర్స్‌ కు రానున్న నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.. ఈ క్రమంలో దానికి సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కన్పించడం సంచలనంగా మారింది. అతను ఆ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీస్తుండటంతో అనుమానంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తనిఖీలు చేయగా ఆ వ్యక్తి కారులో తుపాకీ, మందుగుండు సామగ్రి ఉండడంతో వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేసి.. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, నిందితుడిని డౌనీ నగరానికి చెందిన 38 ఏళ్ల జీనైన్ జాన్ టేలేగా అధికారులు గుర్తించారు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా.. పెద్ద ఎత్తున తుపాకులు, మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రి లభించాయి. దీంతో అతడు ఏ ఉద్దేశంతో గోల్ఫ్‌ కోర్స్‌ వద్దకు వచ్చాడనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు. గతంలో ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి సాయుధుడి సంచారం కలకలం రేపింది.

Also Read : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు… బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్‌

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.