పెట్రోల్, డీజిల్, CNG లాంటి ఇంధన ధరల పెరుగుదల వల్ల ఇప్పటికే సామాన్యులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో మరో ఆర్థిక భారం పడనుంది. దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులు పెంచేందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. విద్యుత్ వినియోగంతో ఏమాత్రం సంబంధం లేకుండానే వినియోగదారులు ప్రతి నెలా కచ్చితంగా చెల్లించాల్సిన ‘ఫిక్స్‌డ్ ఛార్జీల’ను భారీగా పెంచాలని CEA తాజాగా సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గృహ, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులపై ఆర్థిక భారం పెరగనుంది.
మనం కరెంట్ వాడినా, వాడకపోయినా, చివరికి మీటర్ రీడింగ్ ‘0’ ఉన్నాకూడా మనకు విద్యుత్ కనెక్షన్ ఉన్నందుకు ప్రతి నెలా విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన కనీస రుసుమునే ‘ఫిక్స్‌డ్ ఛార్జీలు’ అంటారు. ప్రస్తుతం మనం కడుతున్న కరెంట్ బిల్లులో ఎక్కువ భాగం మనం వాడే యూనిట్ల ఆధారంగానే కరెంట్ ఛార్జీలు ఉంటున్నాయి. విద్యుత్ సరఫరా చేసే డిస్కమ్ సంస్థల మొత్తం ఖర్చుల్లో ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు, గ్రిడ్ మెయింటెనెన్స్ లాంటి స్థిర ఖర్చులు 38 శాతం నుంచి 56 శాతం దాకా ఉంటున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫిక్స్‌డ్ ఛార్జీల ద్వారా డిస్కమ్‌లకు వస్తున్న ఆదాయం కేవలం 9 శాతం నుంచి 20 శాతం మాత్రమే ఉందని CEA తెలిపింది. దీనివల్ల విద్యుత్ సంస్థలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయని పేర్కొంది.
Also Read: నీట్ పేపర్ లీక్ వెనుక బ్యుటీషియన్.. వెలుగులోకి సంచలన నిజాలు
మారుతున్న సాంకేతికత వల్లే డిస్కమ్‌ల ఆదాయం దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు. ధనవంతులు, పెద్ద పెద్ద పరిశ్రమల యాజమాన్యాలు సాంప్రదాయ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌కు మారిపోతున్నారు. దీంతో వారు డిస్కమ్‌ల నుంచి కొనే కరెంట్ యూనిట్ల సంఖ్య చాలావరకు తగ్గిపోతోంది. దీనివల్ల విద్యుత్ సంస్థలకు రావాల్సిన ఆదాయం రావడం లేదు. అందుకే ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి, డిస్కమ్‌ల స్థిర ఖర్చులు- ఆదాయం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఫిక్స్‌డ్ ఛార్జీల పెంపు ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తోంది.
ఈ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు 2030 నాటికి దశలవారీగా పెంపుదల చేపట్టాలని CEA సూచనలు చేసింది. ఇందులో భాగంగానే సాధారణ గృహ, వ్యవసాయ వినియోగదారుల నుంచి వచ్చే స్థిరమైన ఆదాయాన్ని 25 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. అలాగే పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి వచ్చే స్థిర ఆదాయాన్ని 100 శాతానికి పెంచాలని సూచించింది. అలాగే ఎవరైతే సొంతంగా రూఫ్‌టాప్ సోలార్, నెట్-మీటరింగ్ విధానాన్ని వాడుతున్నారో, వాళ్ల కోసం ప్రత్యేక టారిఫ్‌ల విధానాన్ని తీసుకురావాలని కూడా ప్రతిపాదించింది. ఇది పూర్తిగా అమల్లోకి వస్తే రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లులు పెరగనున్నాయి.







