
Russia : ఇరాన్, అమెరికాల మధ్య గొడవల వల్ల హోర్ముజ్ సముద్ర మార్గంలో రాకపోకలు ఆగిపోయాయి. దీనివల్ల భారత్ కు రష్యా నుంచి వచ్చే ఆయిల్ సప్లైకి పెద్ద కష్టం వచ్చింది. ఈ టైమ్‌లో రష్యా మంచి ఐడియా ముందుకు తెచ్చింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ .. నోర్తర్న్ సీ రూట్ అనే కొత్త మంచు సముద్ర దారిని ప్రపంచం ముందుకు తెచ్చారు. ఈ కొత్త రూట్ అందుబాటులోకి వస్తే ప్రపంచ వ్యాపారమే మారిపోతుంది. ఈ ప్లాన్‌పై మన భారత ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది.
రష్యాతో ఈ కొత్త దారి గురించి చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య వ్యాపారానికి దారులు చాలా ముఖ్యమని వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఈ దారిలో తమతో కలిసి పనిచేయడానికి భారత్, చైనాలు చాలా ఆసక్తిగా ఉన్నాయని, ప్రపంచ నిబంధనలకు లోబడి ఈ దారి వల్ల వచ్చే లాభాలను అందరికీ పంచుతామని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై భారత్ కూడా స్పందిస్తూ, రష్యాతో కలిసి దీనిపై నిరంతరం మాట్లాడుతున్నామని స్పష్టం చేసింది.
Also Read : బెదిరింపులకు భయపడం.. హర్మూజ్ ఎప్పటికీ మాదే..ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్
నోర్తర్న్ సీ రూట్ అనేది రష్యా పక్కన ఉండే ఉత్తర ఆర్కిటిక్ మంచు సముద్ర దారి. ఇది అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. ప్రస్తుతం భారత్, చైనాలు యూరప్‌తో వ్యాపారం చేయడానికి ఎర్ర సముద్రం, సూయజ్ కాలువ దారినే వాడుతున్నాయి. కానీ ఈ పాత దారిలో యుద్ధాలు, గొడవల భయం ఎక్కువ. పుతిన్ చెప్పే కొత్త దారి వల్ల దూరం తగ్గి ప్రయాణ సమయం బాగా కలిసి వస్తుంది.
ఈ కొత్త దారి వల్ల ఓడల ప్రయాణంలో 10 నుండి 15 రోజుల సమయం ఆదా అవుతుంది. దారి చిన్నది కావడం వల్ల డీజిల్, పెట్రోల్ ఖర్చులు తగ్గి, సరుకుల రవాణా రేట్లు బాగా తగ్గుతాయి. అంతకంటే ముఖ్యంగా దాడులు, ట్రాఫిక్ జామ్‌ల భయం ఉండదు. అయితే ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో ఎప్పుడూ దారుణమైన చలి ఉండి, నీళ్లన్నీ గడ్డకట్టుకుపోతాయి. అందుకని ఇక్కడ మామూలు ఓడలు వెళ్లలేవు. మంచును కట్ చేసే ప్రత్యేకమైన అణుశక్తి ఓడల సాయం కావాలి. రష్యా దగ్గర అలాంటి పెద్ద పెద్ద ఓడలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్ భారత్‌కు చాలా ముఖ్యం. మన దేశానికి కావాల్సిన కచ్చా ఆయిల్, గ్యాస్‌ను రష్యా నుంచి చాలా చవకగా, వేగంగా తెచ్చుకోవచ్చు. అలాగే వ్యాపారం కోసం ఒకే దారిపై ఆధారపడకుండా ఇది మనకు మూడో సురక్షితమైన దారిగా మారుతుంది. ఆర్కిటిక్ మంచు నీటిలో ఓడలు నడిపేలా మన నావికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు.
రష్యాకు కూడా ఈ దారి చాలా అవసరం. ఆర్కిటిక్ ప్రాంతంలో బోలెడంత ఆయిల్, గ్యాస్, ఖరీదైన ఖనిజాలు ఉన్నాయి. మిగతా దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా ఇప్పుడు భారత్, చైనాలపైనే ఆశలు పెట్టుకుంది. చైనా ఇప్పటికే ఈ దారిని వాడుతోంది. ఇప్పుడు భారత్ కూడా తోడైతే రష్యా కల నెరవేరి, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార దారిగా మారుతుంది.
Also Read : ట్రంప్ బిగ్ స్కెచ్.. విదేశీ డ్రోన్లపై 100% పన్ను బాదుడు.. దీని వెనుక ఉన్న అసలు ప్లాన్ ఇదే!









