
Kurdistan: గత కొంతకాలంగా స్వాతంత్ర కుర్ధిస్థాన్ కోసం పోరాడుతున్న కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పీపీకే)కి చెందిన వేలాది మంది కుర్దు మిలిటెంట్లకు తుర్కియే ప్రభుత్వం క్షమాబిక్ష పెట్టింది. దేశంలో శాంతి స్థాపన కోసం తుర్కియే ప్రభుత్వం గత కొతకాలంగా కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పీపీకే)తో శాంతి చర్చలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా తుర్కియేలో బంధీలుగా ఉన్న వేలాది మంది కుర్దిష్ మిలిటెంట్లకు క్షమాభిక్ష (కొన్ని షరతులకు లోబడి) పెట్టేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన చట్టంపై అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ మేరకు సంతకం కూడా చేశారు. ఇది అధికారిక గెజిట్లోనూ ప్రచురితమవడం గమనార్హం. అయితే, మిలిటెంట్లు నిరాయుధులయ్యారని తుర్కియే సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ధరించిన తర్వాతే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
తుర్కియేలో తమ హక్కుల కోసం కుర్దులు అనేక సంవత్సరాలుగా సాయుధ పోరాటం చేస్తున్నారు. ఇన్నాళ్లు వీరిని అణచివేసే ప్రయత్నం చేసిన ప్రభుత్వం.. ఇటీవల కాలంలో వారితో శాంతి చర్చలకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఓ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. పీపీకే సభ్యుల శిక్షలు నిలిపివేయడం, ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలను ఐదు నుంచి పదేళ్ల పాటు పొడిగించడం వంటి చర్యలకు కూడా సిద్ధమైంది. ఈ వ్యవధిలో మరోసారి నేరాలకు పాల్పడకుంటే వారిపై కేసులను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు తుర్కియే అధికారులు వెల్లడించారు.









