
Telangana Government : తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదల సమయంలో టికెట్ ధరలను పెంచడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC)కు సంక్షేమ విరాళంగా అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇలా వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం తేల్చి చెప్పింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం..టికెట్ ధరల పెంపు వల్ల వచ్చే అదనపు రాబడిపై వర్తించే 20 శాతం వాటాను ఎగ్జిబిటర్ల నుంచి సంబంధిత చిత్రాల నిర్మాతలే వసూలు చేయాల్సి ఉంటుంది. అలా వసూలు చేసిన మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య సంక్షేమ సంఘం ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతాను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read : డ్రగ్స్ తీసుకునే వారికి జడ్జ్‌గా ఉండే ఆర్హత లేదు.. ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్
కాగా ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు ఇటీవల విడుదలయి ఘన విజయం సాధించిన ‘అఖండ-2’, ‘ది రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు ’, ‘పెద్ది’ తదితర చిత్రాలకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.ఈ నాలుగు చిత్రాల నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి 20 శాతం సంక్షేమ విరాళాన్ని వసూలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ మొత్తాన్ని ప్రభుత్వం సూచించిన ఖాతాలో జమ చేసే అధికారం కూడా వారికే కల్పించారు.
ఈ మేరకు ఆయా చిత్రాలను నిర్మించిన 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా, వృద్ధి సినిమాస్ తదితర సంస్థలకు ప్రభుత్వం అధికార లేఖలు పంపింది. సంబంధిత చిత్రాల నిర్మాతలు ఎగ్జిబిటర్ల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసి, టీజీఎఫ్‌డీసీ ద్వారా నిర్వహించే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉద్యోగుల సంక్షేమ సంఘం అకౌంట్‌లో జమ చేయాలని హోం శాఖ ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత నిర్మాతలకు ఈ సందర్బంగా సూచించింది. కాగా, ఈ చిత్రాలతో పాటు త్వరలో రాబోతున్న పలు భారీ చిత్రాలకు కూడా ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : విమల్ యాడ్: షారూఖ్, అజయ్ దేవ్‌గన్ లకు నోటీసులు!









