
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఆ దేశ ఫెడరల్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 75 దేశాల పౌరులకు ఇమిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను పూర్తిగా నిలిపివేస్తూ ఈ ఏడాది జనవరిలో ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు, ట్రంప్ సర్కార్ జారీ చేసిన ఆ ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఈ కేసు విచారణలో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జీనెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 75 దేశాల పౌరులపై విధించిన ఈ వీసా నిషేధం అమెరికాలోని ఫెడరల్ వలస చట్టాల నిబంధనలకు సంపూర్ణంగా విరుద్ధంగా ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. వలస వీసాల మంజూరు, ప్రాసెసింగ్ విషయంలో విదేశాంగ కాన్సులర్ అధికారుల స్వతంత్ర అధికారాన్ని కాలరాసే హక్కు విదేశాంగ కార్యదర్శికి గానీ, ప్రభుత్వానికి గానీ లేదని తీర్పులో పేర్కొన్నారు. దేశాల వారీగా వీసాలను గుడ్డిగా నిలిపివేసే అధికారం చట్ట ప్రకారం ప్రభుత్వానికి లేదని కోర్టు తేల్చిచెప్పింది.
అప్పట్లో ఈ వీసా ఆంక్షలు విధించిన సమయంలో ట్రంప్ ప్రభుత్వం, యూఎస్ విదేశాంగ శాఖ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాయి. నిషేధిత 75 దేశాల నుంచి వచ్చే వలసదారులు అమెరికా పౌరుల సంక్షేమ పథకాలను, నిధులను ఆమోదయోగ్యం కాని రీతిలో వాడుకుంటున్నారని ఆరోపించాయి. కొత్తగా వచ్చే వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అక్కడి ప్రజలకు భారంగా మారరని పూర్తి నిర్ధారణ అయ్యేంతవరకు ఈ వీసాల నిలిపివేత కొనసాగుతుందని, ‘అమెరికా ఫస్ట్’ విధానంలో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది.
ఫెడరల్ కోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుతో గత కొన్ని నెలలుగా వీసాల కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది దరఖాస్తుదారులకు, వారి కుటుంబాలకు ఉపశమనం లభించింది. ప్రభుత్వానికి తన ఇష్టారీతిన వలస నిబంధనలు మార్చే అధికారం లేదని కోర్టు స్పష్టం చేయడంతో ట్రంప్ సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది.









