
Irumudi : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఇరుముడి. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, రవితేజ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలుస్తోంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ సీన్లు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుండటంతో థియేటర్లలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
Also Read : రక్షాబంధన్ యాడ్ లొల్లి.. కృతి సనన్ బోల్డ్ కౌంటర్!
అయితే ఈ సినిమా ఓ ఊహించని వివాదంలో చిక్కుకుంది. చిత్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను తప్పుగా, కించపరిచేలా చూపించారంటూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో ఒక లేడీ టీచర్ పాత్రను వ్యతిరేక ధోరణిలో చూపించడంతో పాటు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జిల్లా పరిషత్ పాఠశాల పేరును, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్‌ను ఉపయోగించడాన్ని ఫెడరేషన్ నాయకులు తప్పుబట్టారు. సమాజంపై తీవ్ర ప్రభావం చూపే సినిమాల్లో ఇలా ఉపాధ్యాయ వృత్తిని, విద్యా వ్యవస్థను తక్కువ చేసి చూపడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
వెంటనే ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని, ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ సీన్లను తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమాపై చెలరేగిన ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాగా ఇరుముడి చిత్రం విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటి రవితేజ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన వంద కోట్ల చిత్రంగా నిలిచింది. బాహుబలి 2 తర్వాత నాలుగో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో చిత్రంగా ఈ చిత్రం రికార్డులోకి ఎక్కడం విశేషం. ఇప్పటికే 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై, డిస్ట్రిబ్యూటర్లకు నాలుగు రెట్ల లాభాలు తెచ్చిపెడుతూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది.
Also Read : తెలుగు సినిమాలకు గోల్డెన్ టైమ్.. 62 రోజులు 6 హిట్లు.. దర్శకులే కింగ్!









