
Priyanka: రాజమండ్రిలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు.. వైద్య విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఘటనకు కారణమైన నిందితులిద్దరిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనపై బాధితురాలి తండ్రి వెంకటేష్ రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ రోజు ఫిర్యాదు చేశారు. నిందితులు సూరావరపు దస్వంత్, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ఈనెల 3న రాత్రి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిందితులు మూడు సార్లు కారుతో ప్రియాంక స్కూటీని ఢీ కొట్టారని, అయితే ప్రస్తుతం పోలీసులు పెట్టిన సెక్షన్లు తక్కువ తీవ్రతతో ఉన్నాయని,. నిందితులకు కఠిన శిక్ష పడేలా సెక్షన్లు మార్చాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్.. ఫిర్యాదుదారుతో చర్చించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయాన్ని ఆయన వారికి వివరించారు.
కాగా, పోలీసులతో మాట్లాడిన అనంతరం ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు.‘‘ నిందితులు ప్రియాంక తలపై కారు ఎక్కించారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. అవయవాలు క్రమంగా చెడిపోతున్నాయని తెలిపారు. నిందితులు మద్యం తాగి ఆవేశంగా కారు నడిపారు. కారుతో తొక్కిస్తే చనిపోతారని తెలిసినా.. కావాలనే వేగంగా నడిపారు. నిందితులు ఉద్దేశపూర్వకంగానే నా కమార్తెను చంపే ప్రయత్నం చేశారన్నది స్పష్టం. నా కుమార్తె భవిష్యత్ పూర్తిగా నాశనమైంది. దర్యాప్తుపై అనుమానాలుంటే.. పోలీసులను అడిగి నివృత్తి చేసుకున్నాం. ప్రతి అంశాన్ని ఆధారాలతో సహా పోలీసులు క్షుణ్ణంగా తెలిపారు. పోలీసులపై నమ్మకం ఉంది.. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. దర్యాప్తు సక్రమంగానే చేస్తున్నారనే నమ్మకం కలిగింది’’ అని వెంటటేశ్ తెలిపారు.
నిందితులపై హత్యకేసు
కాగా, ఈ సందర్భంగా కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ‘‘నిందితులు ప్రియాంక హత్యకు యత్నించారని వీడియోలు చూస్తే అర్థమవుతోందన్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదు.. క్రిమినల్ చర్య. ప్రియాంక హత్యకు ప్రయత్నించారని నిందితులపై కేసు నమోదు చేశామని. దర్యాప్తు తీరుపై ఆమె తండ్రికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామన్నారు. ప్రమాదంపై స్పెషల్ పీపీ సూచన మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం. ప్రియాంకతో పాటు బైక్‌పై ఉన్న ఆమె స్నేహితుడి వాంగ్మూలం కూడా తీసుకున్నాం. ఆధారాలతో సహా సీడీ ఫైల్ బిల్డప్ చేసి.. నిందితులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టాం. ఈనెల 6న నిందితులకు రిమాండ్ విధించారు. అయితే ఈ ఘటనకు ముందు మాల్‌లో ప్రియాంక, నిందితులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే కాక గతంలో ప్రియాంకతో నిందితులకు ఏమైనా వివాదం ఉందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఆమెను కావాలనే కారుతో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రియాంకకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కిమ్స్‌కు తరలించారు. నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తాం’’ అని ఎస్సీ వివరించారు.









