
GAYATRI : ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పి. రాధా గాయత్రి (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం రెండు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. భర్తతో కలిసి సరదాగా గడిపేందుకు హాలిడే ట్రిప్‌నకు వెళ్లిన యువతి, హోటల్ గదిలో శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘోర ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు, భర్త పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుండటంతో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త సౌమ్య శ్రీచరణ్ తాజాగా మీడియాతో మాట్లాడి తనపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. తన భార్య గాయత్రి మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తామిద్దరం ఇష్టపడే వివాహం చేసుకున్నామని, ఒకరిపై ఒకరికి ప్రేమ లేకపోతే లేదా గొడవలు ఉంటే అంత దూరం ముస్సోరి ట్రిప్‌నకు ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. హోటల్ గదిలో దొరికిన మద్యం బాటిళ్లపై స్పందిస్తూ.. తాము ఆర్డర్ చేయలేదని, హోటల్ వారు ఇచ్చిన ప్యాకేజీలో భాగంగానే మద్యం సప్లై చేశారని వివరణ ఇచ్చారు.
శ్రీచరణ్ తన ప్రకటనలో వివాహ బంధం,ట్రిప్ వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో కామన్ ఫ్రెండ్ ద్వారా గాయత్రితో పరిచయం ఏర్పడిందని, పెద్దల అంగీకారంతో అక్టోబర్‌లో నిశ్చితార్థం, నవంబర్ 8న వివాహం జరిగిందని తెలిపారు. పెళ్లయిన కొత్తలో చిన్నచిన్న పొరపచ్చాలు వచ్చినా వాటిని సర్దుబాటు చేసుకున్నామన్నారు. గాయత్రి గురుగ్రామ్‌లో, తాను పుణెలో ఉద్యోగాలు చేయడం వల్ల కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఆషాడమాసం వస్తుందనే ఉద్దేశంతోనే గాయత్రి కోరిక మేరకు ఈ నెల 13న రిషికేష్, 14న రాత్రి ముస్సోరి-ధనౌల్తీ రోడ్డులోని హోమ్‌స్టేకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే, ఘటన జరిగిన రాత్రి విశేషాలను శ్రీచరణ్ వివరిస్తూ.. ఆదివారం రాత్రి తామిద్దరం కలిసి గదిలో సమయం గడిపి తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో నిద్రపోయామన్నారు. ఉదయం లేచి చూసేసరికి గాయత్రి ఫ్లోర్‌పై అపస్మారక స్థితిలో రక్తపు మడుగులో కనిపించిందని, ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం కారుతోందని చెప్పారు. వెంటనే కదిలించి సీపీఆర్ (CPR) ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించానని, ముస్సోరి డాక్టర్లు ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా చెప్పారని శ్రీచరణ్ వెల్లడించారు.
మరోవైపు, గాయత్రి తల్లిదండ్రులు ఈ వాదనలను పూర్తిగా తిరస్కరిస్తూ తమ అల్లుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ కుమార్తె మరణం ముమ్మాటికీ హత్యేనని, శ్రీచరణ్ ఒక పక్కా సైకో అని ఆరోపించారు. ఉన్నత విద్యావంతుడని నమ్మి పిల్లను ఇస్తే, పెళ్లయిన మూడు నెలలకే అతని అసలు రంగు బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిలకడలేని మనస్తత్వంతో ఏ ఉద్యోగంలోనూ నిలదొక్కుకోని శ్రీచరణ్.. నిరంతరం గాయత్రిపై అనుమానంతో తీవ్రమైన మానసిక వేధింపులకు గురిచేసేవాడని, నిరంతరం వీడియో కాల్స్ చేస్తూ వేధించేవాడని తల్లి సత్యవతి కన్నీరుమున్నీరయ్యారు.
శ్రీచరణ్ పక్కా ప్లాన్ ప్రకారమే తమ కుమార్తెను హతమార్చాడని గాయత్రి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. తమది అత్యంత సాంప్రదాయమైన కుటుంబమని, గాయత్రికి అసలు మద్యం సేవించే అలవాటే లేదని స్పష్టం చేశారు. రిషికేష్, హరిద్వార్ వెళ్తున్నానని, ట్రిప్ ముగిశాక విశాఖపట్నం వచ్చి రెండు నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) లో ఇక్కడే ఉంటానని చెప్పిన తమ కూతురు, ఇంటికి రాకుండానే శవమైందని రోదించారు. అంతేకాక, గాయత్రి బ్యాగులో జీపీఎస్ (GPS) ట్రాకర్ దొరకడంపై తమకున్న అనుమానాలను బలపరుస్తూ విశాఖ సీపీ, ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు.
గాయత్రీ తల్లిదండ్రుల ఆరోపణలపై భర్త శ్రీచరణ్ మళ్లీ స్పందిస్తూ.. గాయత్రి పేరెంట్స్ కూతురు చనిపోయిందన్న శోకంలో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారని, వారు తనకు తల్లిదండ్రులతో సమానమని పేర్కొన్నారు. గాయత్రి బ్యాగులో ఉన్న జీపీఎస్ ట్రాకర్ గురించి తనకు అస్సలు తెలియదన్నారు. తాను తప్పు చేసి ఉంటే ముస్సోరిలోనే ఉండి పోలీసులకు ఎందుకు సహకరిస్తానని, ఇప్పటికే అక్కడ తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం తన ఒక్కడి సమస్య కాదని, మూడు గ్రామాల గౌరవానికి సంబంధించిన విషయమని, సాంప్రదాయాలను గౌరవిస్తూ భార్యకు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు.
ముస్సోరి పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. హోటల్ గదిలో గాయత్రి మృతదేహం దుస్తులు లేకుండా ఫ్లోర్‌పై పడి ఉంది, అలాగే బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు ఉన్నాయి. గది నుండి రెండు ఖాళీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని ముస్సోరి పోలీస్ స్టేషన్ ఇన్-ఛార్జ్ దేవేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. అయితే, గాయత్రి గత కొంతకాలంగా లో-బ్లడ్ ప్రెషర్ (Low BP) సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ కేసు అత్యంత సున్నితమైనది , రెండు రాష్ట్రాల సరిహద్దులకు సంబంధించినది కావడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోవడానికి డెహ్రాడూన్‌లోని కొరోనేషన్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల ప్యానెల్ చేత, పూర్తి వీడియో రికార్డింగ్ ద్వారా శవపరీక్ష (Post-Mortem) నిర్వహించేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే హోటల్ సిబ్బందిని, పక్క గదుల్లో ఉన్న ఇతర పర్యాటకులను కూడా పోలీసులు ముమ్మరంగా ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ కేసు “అనుమానాస్పద మృతి”గా నమోదై దర్యాప్తు దశలో ఉంది. గాయత్రిది సహజ మరణమా, మానసిక ఒత్తిడి తట్టుకోలేక చేసుకున్న బలవన్మరణమా, లేక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మిస్టరీ వీడాలంటే అంతర్గత గాయాలు, మరణానికి గల అసలు కారణాలను విశ్లేషించే ఫోరెన్సిక్ , పోస్ట్‌మార్టం తుది నివేదికలు రావడమే కీలకం కానుంది. ఆ నివేదికల ఆధారంగానే పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.









