
Nepal : నేపాల్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ బృందాలు మరో ఇద్దరిని సజీవంగా బయటకు తీసుకొచ్చాయి. వీరిలో హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న చైనా కార్మికుడు ఒకరు కాగా.. నువాకోట్ పట్టణంలో దెబ్బతిన్న ఇంట్లో చిక్కుకున్న 64 ఏళ్ల మహిళ మరొకరు. దీంతో ఇటీవల సజీవంగా రక్షించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
హైడ్రోపవర్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న చైనా వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. త్రిశూలి హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద ఇది మూడో విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్. శుక్రవారం ఇదే ప్రాంతంలోని త్రిశూలి 3ఏ హైడ్రోపవర్ ప్లాంట్ సొరంగం నుంచి ఇద్దరు నేపాలీ కార్మికులను సజీవంగా బయటకు తీసుకొచ్చారు.
చైనా కార్మికుడి రక్షణ చర్యలను నేపాల్ సైనిక సిబ్బంది, దక్షిణ కొరియాకు చెందిన విపత్తు సహాయక నిపుణులు కలిసి చేపట్టారు. 225 మీటర్ల పొడవైన సొరంగం నుంచి అతడిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెస్క్యూ తర్వాత చైనా కార్మికుడిని హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్‌లో అతడికి సైనిక వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్న దృశ్యాలను నేపాల్ సైన్యం విడుదల చేసింది.
Also Read : దక్షిణాఫ్రికా మొత్తాన్ని ఫొటో తీసే కెపాసిటీ.. శత్రువుల దాడులను పసిగట్టే శక్తి.. GSLV-F17 ప్రత్యేకతలివే!
#अपरत्रिशुली१ सुरङबाट विदेशी नागरिकको जीवितै उद्धार#NepaliArmy#BhotekoshiFlood pic.twitter.com/An7wxJJEOh
— Nepali Army (@NepaliArmyHQ) September 5, 2026
మరోవైపు నువాకోట్ పట్టణంలో దెబ్బతిన్న ఓ ఇంటి నుంచి 64 ఏళ్ల చండికా శ్రేష్ఠ అనే మహిళను రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకొచ్చారు. ఇంటి శిథిలాల్లో చిక్కుకున్న ఆమెను బయటకు తీసిన తర్వాత వైద్య చికిత్స కోసం హెలికాప్టర్‌లో ఖాట్మండుకు తరలించారు. రెస్క్యూ సమయంలో అత్యవసర సిబ్బంది చండికా శ్రేష్ఠను బూడిద రంగు దుప్పటిలో చుట్టి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి.
ఇదిలా ఉంటే.. నేపాల్‌లోని 12 హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో దాదాపు 900 మంది కార్మికులు ఇంకా కనిపించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో సుమారు 500 మంది వివిధ సొరంగాల్లో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Also Read : ఆ ఇళ్లు కట్టినోళ్లకు దండం పెట్టాలి… నేపాల్ వరదల్లో షాకింగ్ దృశ్యం








