Chinna Srinu Resign : ఉత్తరాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)కి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డికి పంపినట్లు తెలుస్తోంది. కాగా చిన్న శ్రీను విజయనగరం జడ్పీ ఛైర్మన్ గా పనిచేస్తున్నారు.అలాగే జిల్లా అధ్యక్షుడితో పాటు భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గానూ పనిచేస్తున్నారు. కాగా ఈ రోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం.. కొత్తపార్టీపై విజయసాయిరెడ్డి క్లారిటీ

కాగా బొత్స తర్వాత జిల్లాలో అంతటి పట్టున్న నేతగా చిన్న శ్రీను గుర్తింపు పొందారు. అంతటి నేత ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి జిల్లాలో బిగ్ షాక్ తగినట్లైంది. అయితే చిన్న శ్రీను ఏ కారణంతో పార్టీని వీడారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. సొంత మేనమామ అయిన బొత్స ఎందుకు చిన్న శ్రీను రాజీనామాను ఆపలేకపోయారనే ప్రశ్నలు పార్టీ నేతల్లోనూ తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిన్న శ్రీను రాజీనామా అంశం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే తన పుట్టినరోజును వేలాది మంది అభిమానుల సమక్షంలో అందులోనూ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుపుకున్న ఆయన ఒక్కసారిగా రాజీనామా నిర్ణయం తీసుకోవడం చర్చనీయంశంగా మారింది.

అయితే ప్రస్తుతం రాష్ర్టంలో స్థానికి సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాథాన్యత సంతరించుకుంది. విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బొత్స కూతురును తెర మీదకు తీసుకురావడం మూలంగానే చిన్న శ్రీను రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ జడ్పీ పీఠంపై ఆశ పెట్టుకున్న చిన్న శ్రీనుకు పోటీగా బొత్స కూతురు రంగంలోకి దిగడంతో మనస్థాపానికి గురైన ఆయన రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. చిన్నశ్రీను రాజీనామాతో టీడీపీ నాయకత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. చిన్నశ్రీనును పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఉత్తరాంధ్రలో టీడీపీని మరింత బలోపేతం చేయడమే కాకుండా బొత్స సత్యనారాయణకు చెక్‌ పెట్టే అవకాశం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. అయితే ఆయన రాజీనామా చేసిన తర్వాత తన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేయడంతో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామాపై స్పందిస్తేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని కార్యకర్తలు అంటున్నారు. మరోవైపు చిన్నశ్రీను రాజీనామాపై జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా అలర్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఆయనను తనతో నేరుగా మాట్లాడించాలని ముఖ్యనేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : నేపాల్ వరదల్లో ఊహించని అద్భుతం.. సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ చైనా కార్మికుడు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.