Crime News : తండ్రి పదవిలో ఉండటం, ఆర్థిక వనరులు ఉండటం, తమకు ఏమన్నా అయితే తండ్రి,అధికారం ఉన్నాయనే ధీమాతో కొంతమంది ప్రముఖుల కొడుకులు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. దీంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా నగరంలోని మాదాపూర్‌లో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. లగ్జరీ కారు వేగానికి అమాయకురాలు ప్రాణాలు కోల్పోయింది. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి దుర్మరణం పాలైంది. కాగా, ఈ సమయంలో ఆ లగ్జరీ కారును నడుతుపుతున్నది ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజుష్‌గా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటన ఈ నెల 16న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో జరిగింది. మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్ అసోసియేట్‌గా పనిచేస్తున్న భారతి ముఖి అనే 26 ఏళ్ల యువతి, తన సహోద్యోగి పూజా అశోక్‌తో కలిసి ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలో లంచ్ తీసుకురావడానికి వెళ్లారు. అనంతరం భోజనం ప్యాకెట్ తీసుకుని తిరిగి మాల్‌లోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో. ఒక్కసారిగా దూసుకొచ్చిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ ‘ఆస్టన్ మార్టిన్’ (TG-09-G-0666) అత్యంత వేగంగా భారతిని ఢీకొట్టింది. అంత స్పీడుతో కారు ఢీకొనడంతో భారతి గాల్లోకి ఎగిరి కిందపడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా, ఈ ఘటనపై లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన మాదాపూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కారు వివరాలు పరిశీలించారు… వాటి ఆధారంగా కారు నడుపుతున్నది జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజుష్ (21) గా గుర్తించారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రాణాలు తీసినందుకు గాను పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు.
ఈ మేరకు నిందితుడు సంజుష్‌కు చట్టపరమైన నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిత్యం ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రజలతో రద్దీగా ఉండే సైబరాబాద్ ప్రాంతంలో ఇలాంటి సూపర్ లగ్జరీ కార్ల ర్యాష్ డ్రైవింగ్ రోజురోజుకూ పెరుగుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం గ్రామాల నుంచి నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న అమాయకులు ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లకు బలవుతున్నారని వాపోతున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.