
చైనా అత్యంత రహస్యంగా నడుపుతున్న రోబోటిక్ స్పేస్ ప్లేన్ ‘షెన్లాంగ్’ ఫొటో ఒకటి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు చైనా దీనికి సంబంధించి ఒక్క అధికారిక ఇమేజ్ను కూడా విడుదల చేయలేదు. కానీ, అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) తాజాగా ప్రచురించిన థ్రెట్ అసెస్మెంట్ రిపోర్టులో ఈ స్పేస్ ప్లేన్ చిత్రం బయటకు వచ్చింది.
స్పేస్ లో ఏం చేస్తోంది?
ఈ ఫొటోను 2024లో ‘మ్యాక్సర్ టెక్నాలజీస్’ శాటిలైట్ సుమారు 90 కిలోమీటర్ల దూరం నుంచి క్యాప్చర్ చేసింది. అందులో కనిపించిన విజువల్స్ ప్రకారం:
స్పేస్ క్రాఫ్ట్ సోలార్ ప్యానెల్స్ పూర్తిగా ఓపెన్ అయి ఉన్నాయి.
విమానం వెనుక భాగంలో ఉండే పేలోడ్ డోర్ తెరిచి ఉంది.
అంతరిక్షంలో ఇది మరో శాటిలైట్‌తో కనెక్ట్ (డాకింగ్) అయి ఉన్నట్లు కనిపిస్తోంది.
గత ఆరేళ్లుగా లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లో తిరుగుతున్న ఈ రోబోటిక్ ప్లేన్, మధ్యమధ్యలో గుర్తుతెలియని ఆబ్జెక్టులను అంతరిక్షంలోకి రిలీజ్ చేస్తూ ప్రపంచ దేశాలకు అంతుచిక్కకుండా మారింది. దీంతో గ్రౌండ్ బేస్డ్ రాడార్లు, ట్రాకింగ్ సిస్టమ్స్ ద్వారా శాస్త్రవేత్తలు దీన్ని నిరంతరం మానిటర్ చేస్తున్నారు.
ఇది అమెరికాకు చెందిన బోయింగ్ X-37B స్పేస్ ప్లేన్‌ను పోలి ఉంటుంది. ఇదొక రీయూజబుల్ స్పేస్ ప్లేన్. రాకెట్ సాయంతో ఆర్బిట్‌లోకి ప్రవేశించి, తన మిషన్ పూర్తయ్యాక సాధారణ రన్‌వే పై ల్యాండ్ అవుతుంది. తాజా విశ్లేషణల ప్రకారం దీని పొడవు సుమారు 26 అడుగులు ఉండవచ్చని అంచనా. అంతరిక్షంలోకి కొత్త పేలోడ్లను తీసుకెళ్లడం, ప్రయోగాలు చేయడం, తిరిగి సురక్షితంగా భూమికి చేర్చడం దీని ప్రధాన లక్ష్యం.
ప్రస్తుతం ఇది తన నాలుగో మిషన్‌లో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ‘లాంగ్ మార్చ్-2ఎఫ్’ రాకెట్ ద్వారా దీన్ని ఆర్బిట్‌లోకి పంపారు. డ్రాగన్ దేశం తన స్పేస్ వార్ఫేర్ సామర్థ్యాన్ని ఎంత వేగంగా పెంచుకుంటోందో ఈ లీకైన పిక్చర్ స్పష్టం చేస్తోంది.









