PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో అధికారికంగా వెల్లడించింది. ఎంపీలు సంజయ్ సింగ్, వి.శివదాసన్ అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా లిఖితపూర్వక సమాధానం ఇస్తూ దేశాల వారీగా, పర్యటనల వారీగా అయిన ఖర్చులను పార్లమెంట్ ముందు ఉంచారు.

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదిక ప్రకారం 2025 సంవత్సరంలో ప్రధాని మోదీ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జపాన్ వంటి 23 దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలకు గాను మొత్తం రూ. 187 కోట్లకు పైగా ఖర్చు అయింది. గత ఏడాది జరిగిన పర్యటనలలో అత్యధికంగా ఫ్రాన్స్ పర్యటనకు సుమారు రూ. 25.6 కోట్లు, అమెరికా పర్యటనకు రూ. 16.5 కోట్లు, బ్రెజిల్ పర్యటనకు రూ. 17.7 కోట్లు, సౌదీ అరేబియా పర్యటనకు రూ. 15.5 కోట్లు, చైనా పర్యటనకు రూ. 10.6 కోట్లు, బ్రిటన్ పర్యటనకు రూ. 9.9 కోట్లు ఖర్చయ్యాయి. ఇవే కాకుండా కెనడా, శ్రీలంక, థాయిలాండ్, అర్జెంటీనా, మాల్దీవులు, సౌతాఫ్రికా వంటి అనేక ఇతర దేశాలలో కూడా ప్రధాని పర్యటించారు.

ఇక 2026 సంవత్సరంలో జూలై మధ్య నాటికి జరిగిన విదేశీ పర్యటనలకు గాను ఇప్పటివరకు రూ. 74.58 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం తెలిపింది. జూలై 6 నుండి జూలై 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ప్రధాని చేసిన పర్యటనల ఖర్చులు కూడా ఇందులో ఉన్నాయి. 2021 నుంచి ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చులు చూస్తే.. 2021లో రూ. 36 కోట్లు, 2022లో రూ. 55.82 కోట్లు, 2023లో రూ. 93 కోట్లు, 2024లో రూ. 109 కోట్లు ఖర్చయ్యాయి. పోలిక కోసం గతంలో 2011 లో అమెరికా పర్యటనకు రూ. 10.74 కోట్లు, 2013 లో రష్యా పర్యటనకు రూ. 9.95 కోట్లు ఖర్చయినట్లు మంత్రి గుర్తుచేశారు.

ఈ విదేశీ పర్యటనల వల్ల దేశానికి జరిగిన ప్రయోజనాలను వివరిస్తూ, విదేశాలతో సంబంధాలను మంత్రి మార్గరీటా పేర్కొన్నారు. జూలై 2021 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనల సందర్భంగా 316 ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. అంతేకాకుండా, ఏప్రిల్ 2021 నుండి డిసెంబర్ 2025 మధ్య భారత్‌కు ఏకంగా 381.8 బిలియన్ డాలర్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు వచ్చాయని పార్లమెంట్‌కు సమర్పించిన 35 పేజీల నివేదికలో వెల్లడించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.