
Air India : ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్యల అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాలిలో ఉన్న సమయంలోనే విమానంలో కుదుపులు చోటు చేసుకోగా పలువురు ప్రయాణీకులు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం AI2379 గాల్లో ఉన్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల మూలంగా భారీ కుదుపులకు గురైంది. విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందకు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్ విమానాన్ని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
Also Read : చిన్నారులను టార్గెట్ చేస్తున్న సైలెంట్ కిల్లర్.. గుజరాత్‌ను గజగజలాడిస్తున్న చండీపురా వైరస్
కాగా ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య బృందాలు గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించాయి. గాయాలు ఎక్కువైన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని సంస్థ తెలిపింది. అలాగే ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, సంఘటన సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యను పలువురు ప్రయాణీకులు వివరించారు. ఆ సమయంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా విమానం బలంగా కుదుపులకు గురికావడంతో సీట్లలో కూర్చోని ఉన్నవారు తీవ్రంగా ఎగిరిపడ్డారని, కొందరికి తల, చేతులు, భుజాలకు గాయాలయ్యాయని వారు తెలిపారు. విమానం లోపల ఉన్న ప్రయాణీకుల సామాన్లు కూడా చెల్లాచెదురుగా పడిపోయాయని వారు తెలిపారు.
ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపినప్పటికీ ప్రయాణికులు మాత్రం స్వయంగా తమ కష్టాలను వివరించారు. వారంతా మీడియాతో మాట్లాడుతూ..ఈ ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, కానీ అదృష్టవశాత్తూ మేమందరం సురక్షితంగా బయటపడ్డామని వెల్లడించడం గమనార్హం. విమానం కుదుపులకు గురైన సమయంలో 100 మందికి పైగా ఉండగా, వారిలో 70 నుంచి 80 శాతం మంది గాయపడ్డారని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అంతేకాక తాము ఎయిర్ ఇండియాపై ఖచ్చితంగా చర్య తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.
Also Read : సీఎం విజయ్, నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!









