Emaar scam : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో సంచలనమైన ‘ఎమ్మార్ టౌన్‌షిప్ స్కామ్’ కేసు ఊహించని మలుపు తిరిగింది. టాలీవుడ్ ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్, ప్రముఖ మాజీ క్రికెటర్ వి. చాముండేశ్వరనాథ్ లతో పాటు పలువురి విల్లా ప్లాట్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విధించిన అటాచ్‌మెంట్ ఆర్డర్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. న్యూఢిల్లీలోని PMLA అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆగస్టు 6న కీలక తీర్పునిచ్చింది. కోట్ల రూపాయలు పెట్టి, దాదాపు 95 శాతం డబ్బులను చెక్కులు, బ్యాంక్ లావాదేవీల ద్వారా చెల్లించి ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లకు క్లీన్‌చిట్ ఇచ్చింది. అసలు ఎమ్మార్ స్కామ్ అంటే ఏంటి? రూ.167 కోట్లకు పైగా జరిగిన Financial గోల్‌మాల్ వెనుకున్న కీలక సూత్రధారులు ఎవరు? రామ్ చరణ్, చాముండేశ్వరీనాథ్ లు కొనుగోలు చేసిన కోట్ల విలువైన గచ్చిబౌలి ప్లాట్ల భవిష్యత్తు ఏంటి ? ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ కేసు మూలాలు అర్థం కావాలంటే మనం 2002 నుంచి 2008 మధ్య జరిగిన పరిణామాలను గమనించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు YS రాజశేఖర్ రెడ్డి హయాంలో.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో దాదాపు 535 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు.
ఇందులో ఒక అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే విల్లాలు, అపార్ట్‌మెంట్లు, గోల్ఫ్ కోర్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలి. దీనికోసం ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC), దుబాయ్‌కి చెందిన అంతర్జాతీయ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్ కలిసి జాయింట్ వెంచర్‌గా ఒక Special Purpose Vehicleని ఏర్పాటు చేశాయి. దానిపేరే ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్ (EHTPL).

ఈ జాయింట్ వెంచర్‌లో ఒప్పందం ప్రకారం.. ఎమ్మార్ సంస్థకు 74 శాతం ఈక్విటీ షేర్‌ను, ప్రభుత్వ సంస్థ APIICకి భూమి ఇచ్చినందుకు గానూ 26 శాతం ఈక్విటీ షేర్ కేటాయించారు. అంటే, ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ప్రతీ లాభంలో, ఆదాయంలో ఇప్పుడు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు APIIC ద్వారా 26 శాతం వాటా రావాలి.
ఈ ఒప్పందం బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమైంది.
ఎమ్మార్ గ్రూప్ తమ లాభాలను పెంచుకోవడానికి, ప్రభుత్వ సంస్థ APIICకి దక్కాల్సిన 26 శాతం వాటాను నొక్కేయడానికి ఒక పెద్ద కుట్ర పన్నింది. ఇందుకోసం ఎమ్మార్ హిల్స్ సంస్థ… ‘ఎమ్మార్ MGF లాండ్ లిమిటెడ్’- EMGF అనే మరో డెవలపర్‌ను రంగంలోకి దించింది.

మొదట ఎమ్మార్ MFGకి 75 శాతం, ఎమ్మార్ హిల్స్‌కు 25 శాతం రాబడి అని ఒప్పందం చేసుకుని.. ఆ తర్వాత రహస్యంగా అనుబంధ ఒప్పందాలు చేసుకున్నారు. APIIC రాబడి వాటాను 26 శాతం నుంచి ఏకంగా 5 శాతానికి తగ్గించేశారు. దీనివల్ల APIICకి రావాల్సిన వందల కోట్ల ఆదాయం ఘోరంగా పడిపోయింది. డాక్యుమెంట్ల ప్రకారం విల్లా ప్లాట్లలో ఒక చదరపు గజం కేవలం రూ.5,000 లకే అమ్ముతున్నట్లు కాగితాల్లో చూపించారు. కానీ బయట ప్రాజెక్ట్ మార్కెట్ రేటు రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంది. కొనుగోలుదారుల నుంచి అధికారికంగా రూ.5,000 మాత్రమే తీసుకంటున్నామని చెక్కులు తీసుకున్నారు. కానీ మిగిలిన మొత్తాన్ని చదరపు గజానికి రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు క్యాష్ రూపంలో వసూలు చేశారు. స్టైలిష్ హోమ్స్ అనే ఏజెంట్ ద్వారా తుమ్మల రంగారావు, కోనేరు రాజేంద్రప్రసాద్, కోనేరు మధు, ఎన్.సునీల్ రెడ్డి వంటివారు ఏకంగా 102.87 కోట్లకు పైగా బ్లాక్ మనీని నగదు రూపంలో వసూలు చేసి, ఆ మొత్తాన్ని అక్కౌంట్స్‌లో చూపించకుండా పక్కదారి పట్టించారు. ఈ వ్యవహారంపై 2011లో సీబీఐ FIR నమోదు చేసింది. దర్యాప్తులో ఎమ్మార్ ప్రమోటర్లు ఏకంగా రూ.167.29 కోట్ల నిధులను అక్రమంగా ఆర్జించారని సీబీఐ, ఈడీ తేల్చిచెప్పాయి.

ఎమ్మార్ కంపెనీ.. ప్రభుత్వం కళ్ళు గప్పి వందల కోట్లు నొక్కేసింది అనేది CBI ఆరోపణ. అయితే ఈ విల్లా ప్రాజెక్ట్‌లో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన VIPలు, ప్రముఖుల పరిస్థితి ఏంటి?. అందులోనే నటుడు రామ్ చరణ్, చాముండేశ్వరీనాథ్,కే. లలిత, బిజయ్ కుమార్ మంధాని వంటివారు ఉన్నారు. వీరు గచ్చిబౌలిలోని బోల్డర్ హిల్స్‌లో కోట్ల రూపాయలు చెల్లించి ప్లాట్లు బుక్ చేసుకున్నారు. 95 శాతం డబ్బులు కూడా చెల్లించారు. కానీ 2012లో ఈడీ రంగంలోకి దిగి, ఈ ప్లాట్లను అక్రమ సంపాదనతో ముడిపడిన ఆస్తులుగా భావించి.. వాటిని అటాచ్‌మెంట్ చేసింది. మరి కొనుగోలుదారులు చెల్లించిన డబ్బులు ఏమయ్యాయి? వారు మోసపోయారా? లేక వారి ప్లాట్లను ఎమ్మార్ సంస్థ కావాలనే ఈడీకి అప్పగించిందా? ఇప్పుడు చూద్దాం.

ఈడీ అటాచ్ చేసిన 14 ప్లాట్లలో, ప్రస్తుత అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందుకు వచ్చిన 4 ప్రధాన ప్లాట్ల వివరాలు ఉన్నాయి.

1.వి.చాముండేశ్వరనాథ్:
ప్లాట్ నంబర్: B-44 (1,458 చదరపు గజాలు)
2014 నాటికి ఈడీ లెక్కించిన విలువ: రూ. 3.64 కోట్లు
ఈయన 2005లోనే MOU కుదుర్చుకుని, చెక్కుల ద్వారా రూ.69 లక్షల 25 వేల 500 (సుమారు 95 శాతం) చెల్లించారు.
మిగిలిన 5 శాతం 3 లక్షల వేల రూపాయలను రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు.

2. కె.రామ్ చరణ్ తేజ్:
ప్లాట్ నంబర్: B-30 (1,545 చదరపు గజాలు)
ఈడీ లెక్కించిన విలువ: రూ.3.86 కోట్లు
రామ్ చరణ్ 2009లో IDBI బ్యాంక్ ద్వారా 73 లక్షల 38 వేల 750 రూపాయలు చెల్లించారు.
బ్రోకరేజ్/కమిషన్ కింద మరో చెక్ ద్వారా రూ. 3 లక్షల 40 వేల 827 రూపాయలు లీగల్‌గా చెల్లించారు. మొత్తం ప్లాట్ విలువలో 95 శాతం సొమ్ము బ్యాంకింగ్ ద్వారానే వెళ్లింది.

3. కే. లలిత:
ప్లాట్ నంబర్: A-11 (1,192 చదరపు గజాలు)
ఈడీ లెక్కించిన విలువ: రూ.2.98 కోట్లు
2008లో డీడీ ద్వారా ఆమె 56 లక్షల 62 వేలు (95%) చెల్లించారు.

4. బిజయ్ కుమార్ మంధాని:
ప్లాట్ నంబర్: B-46 (1,486 చదరపు గజాలు)
ఈడీ లెక్కించిన విలువ: రూ. 3.71 కోట్లు
ఈయన కూడా రూ.70 లక్షల 58 వేల 500 చెల్లించినట్లు ఒప్పందం ఉంది.

ఈ నలుగురూ కూడా తమ ప్లాట్ విలువలో 95 శాతం చెల్లించిన సొమ్ము White Moneyయే. చెక్కులు, డీడీల రూపంలో చెల్లించినట్లు, తమ Income Tax Returnsలో స్పష్టంగా డిక్లేర్ చేశారు.

ఇక్కడే ఎమ్మార్ సంస్థ ఆడిన ఒక పెద్ద మోసం బయటపడింది. కొనుగోలుదారులు 95 శాతం డబ్బులు చెల్లించిన తర్వాత, మిగిలిన 5 శాతం డబ్బులు ఇచ్చి Registration చేసుకోవాల్సి ఉంది. కానీ APIIC ఆరోపణలతో ఎమ్మార్ సంస్థ అక్రమాలు బయటపడ్డాయి. దీంతో 2010 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది.ఎమ్మార్ ప్రాజెక్ట్‌లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిషేధించింది. దాంతో కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ తీసుకోలేకపోయారు.
ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు ప్రారంభించగానే.. ఎమ్మార్ కంపెనీ ఆఫీసర్లు తమ సిస్టమ్స్‌లో తప్పుడు తేదీలతో రద్దు చేసుకున్నట్లు ఉన్న లేఖలను సృష్టించారు. అంటే.. ”ఈ ప్లాట్లను కొనుగోలుదారులు క్యాన్సిల్ చేసుకున్నారు, ఇవి అమ్ముడుపోని ప్లాట్లు” అని ఈడీ అధికారులకు అబద్ధం చెప్పారు.

కానీ నిజానికి.. కొనుగోలుదారులకు ఆ క్యాన్సిలేషన్ ఉత్తర్వులు ఎప్పుడూ అందలేదు. కొనుగోలుదారులు కట్టిన 95 శాతం సొమ్మును ఎమ్మార్ సంస్థ వారికి వెనక్కి తిరిగి ఇవ్వలేదు. ఎమ్మార్ చెప్పిన అబద్ధాన్ని నమ్మి, ED.. ఈ ప్లాట్లను ‘అమ్ముడుపోని ఆస్తులు’ గా భావించి 2012లో ప్రొవిజనల్ అటాచ్‌మెంట్ చేసింది. ఆ తర్వాత విచారణను మరిన్ని వివరాలతో 2014లో రెండవ ప్రొవిజనల్ అటాచ్‌మెంట్ ఆర్డర్ ద్వారా ఆస్తులు అటాచ్ చేసింది. దీంతో రామ్ చరణ్ తేజ్, చాముండేశ్వరీనాథ్ లాంటి కొనుగోలుదారుల ప్లాట్ల విలువ రూ.3 కోట్లకు పైగా దాటింది.

అయితే తమ ప్లాట్లను ఈడీ అటాచ్ చేయడాన్ని సవాలు చేస్తూ రామ్ చరణ్, చాముండేశ్వరీనాథ్, లలిత, మంధానిలు ‘PMLA అప్పిలేట్ ట్రిబ్యునల్’ ను ఆశ్రయించారు. వారి తరఫు న్యాయవాదులు ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించారు. “మా క్లయింట్లు పేపర్ ప్రకటనలు, హోర్డింగ్స్ చూసి చట్టబద్ధంగా కంపెనీకి చెక్కుల ద్వారా 95 శాతం డబ్బులు చెల్లించారు. వీరికి నేరంతో గానీ, ఈమార్ చేసిన నిధుల మళ్లింపుతో గానీ ఎలాంటి సంబంధం లేదని” వాదించారు. వారు చెల్లించిన ప్రతి రూపాయి లీగల్ సంపాదన అని.. అక్రమ సంపాదనతో ఈ ప్లాట్లు కొనలేదని వివరించారు.

ఎమ్మార్ సంస్థ చేసిన స్కామ్‌లో మా క్లయింట్లు బాధితులని పేర్కొన్నారు. అంతేకాదు ఎమ్మార్ సంస్థకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని.. ఈడీ నిజమైన నిందితుల ఆస్తులను వదిలేసి, లీగల్‌గా కొనుగోలు చేసిన అమాయక బాధితుల ప్లాట్లను అటాచ్ చేయడం పూర్తిగా అన్యాయమని వాదించారు.

ఈ వాదనలన్నీ విన్న ప్రత్యేక ‘PMLA అప్పిలేట్ ట్రిబ్యునల్ సింగిల్ బెంచ్ జడ్జి రాజేష్ మల్హోత్రా.. ఆగస్టు 6న దీనిపై సంచలన తీర్పునిచ్చారు. ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో కీలకమైన అంశాలను వెల్లడించింది. కొనుగోలుదారులు 95 శాతం సొమ్మును చెక్కులు/డీడీల ద్వారా చెల్లించారని PMLA కోర్టులో నిరూపించుకోవాలని ఆదేశించింది. కానీ ఈడీ అటాచ్ చేసిన వారి ప్రాపర్టీలను రిలీజ్ చేసేందుకు నిరాకరించింది. కొనుగోలుదారులు బాధితులా ? కాదా? అనేది దానిపై ఈడీ మళ్లీ విచారణ చేయవచ్చని సూచించింది. ఒకవేళ కొనుగోలుదారులు బాధితులు అని తేలితే ఈడీ వెంటనే ఈ వివరాలను వెరిఫై చేసి, PMLA కోర్టులో నివేదిక సమర్పించి ఈ ప్లాట్లను అటాచ్‌మెంట్ నుండి విడుదల చేయాలని ఆదేశించింది.

ఒకవేళ ఈడీ నిర్దేశిత సమయంలో చర్యలు తీసుకోకపోతే, రామ్ చరణ్, ఇతర కొనుగోలుదారులు నేరుగా ‘స్పెషల్ PMLA కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది. ఈ స్కామ్‌తో వీళ్లకు సంబంధం లేదని తేలితే మిగిలిన 5 శాతం బ్యాలెన్స్ సొమ్మును డిపాజిట్ చేసి, ప్లాట్లను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. అంటే ఇక్కడ ఆగస్టు 6న వచ్చిన తీర్పుతో రామ్ చరణ్, చాముండేశ్వరీనాథ్‌లతో పాటు ఇతర కొనుగోలుదారులకు కొంతవరకు రిలీఫ్ లభించింది.
ఇప్పుడు ఈడీ కొనుగోలుదారుల తప్పు లేదని కోర్టుకు రిపోర్ట్ ఇచ్చినా లేదా కొనుగోలుదారులు ఈ స్కామ్‌తో తమకు సంబంధం లేదని నిరూపించినా ఈ కోట్ల విలువైన గచ్చిబౌలి విల్లా ప్లాట్లు క్లియర్ అయిపోతాయి. అంటే లీగల్‌గా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఇందులో దాదాపు క్లీన్‌చిట్ లభించిందనే చెప్పొచ్చు.

మొత్తానికి 2012 నుంచి నడుస్తున్న ఎమ్మార్ విల్లా ప్లాట్ల అటాచ్‌మెంట్ డ్రామాకు ఆగస్టు 6 నాటి ట్రిబ్యునల్ తీర్పుతో ఒక స్పష్టమైన ముగింపు లభించే దిశగా అడుగులు పడ్డాయి.
రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎంత పెద్ద బిల్డర్ అయినా, ప్రాజెక్ట్ కొనేటప్పుడు లీగల్ అంశాలు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో.. అలాగే నిజాయితీగా అకౌంటెడ్ మనీతో కొనుగోలు చేస్తే చట్టం ఎలా రక్షణగా నిలుస్తుందో ఈ కేసు ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.