
Chandigarh : పంజాబ్, చండీగఢ్ ప్రాంతంలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. చండీగఢ్‌లోని సెక్టర్-43 బస్టాండ్ వెనుక ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఒక అనుమానాస్పద ఐఈడీతో పాటు, ఆయుధం, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా లవ్ ప్రీత్ సింగ్ (19), జషన్ ప్రీత్ సింగ్ అలియాస్ జషన్ దీప్(21), ప్రభ్ ప్రీత్ సింగ్ అలియాస్ ప్రభ్(19)లను అరెస్ట్ చేశారు. వీరంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)తో సంబంధాలున్న అనుమానిత ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు అదుపులో ఉన్న వీరిలో ఇద్దరు తరన్ తారన్.. మరొకరు అమృత్ సర్ కు చెందినవారు. వారి నుంచి దాదాపు 5 కిలోల జిలెటిన్ స్టిక్స్, ఆయుధాలు, ఐఈడీ తయారు చేయడానికి ఉపయోగించే విడిభాగాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Also Read : వాటర్ ప్లాంట్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. 60 మందికి అస్వస్థత
చండీగఢ్ లో సెక్టార్ 43 బస్ స్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరికి పాక్ కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది సత్నామ్ సట్టాతో సంబంధాలున్నట్లు తేలింది.. వీరు తాజాగా పంజాబ్, చండీగఢ్ లో ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చండీగఢ్‌లో బికేఐ ఆపరేటివ్‌ల కదలికలపై నిఘా వర్గాల నుంచి వచ్చిన పక్కా సమాచారం ఆధారంగానే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ రికవరీ అనంతరం పోలీస్ స్టేషన్ 36లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. లభ్యమైన వస్తువులను పరిశోధన సంస్థలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఐఈడీ స్వభావం, ఇతర పదార్థాల మూలాలను విశ్లేషిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రజా భద్రత కోసం అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Also Read : విడుదలకు ముందే ‘టాక్సిక్’ జోష్.. 5 లక్షల టికెట్స్ సేల్.. రూ.30 కోట్లు దాటిన వసూళ్లు









