
Nagpur Chlorine Gas Leak : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ లో సోమవారం తెల్లవారుజామున క్లోరిన్ వాయువు లీక్ కావడంతో ప్లాంట్ సిబ్బంది, సమీప నివాసితులతో సహా దాదాపు 50-60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గోధ్ని ప్రాంతంలోని కలెక్టర్ కాలనీ సమీపంలో ఉన్న నీటి శుద్ధి కేంద్రం వద్ద ట్యాంకర్ నుంచి క్లోరిన్ వాయువు పెద్ద మొత్తంలో లీకైనట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. లీకేజీ కారణంగా పరిసర ప్రాంతాల్లోని పలు కుటుంబాలు ప్రభావితమయ్యాయి.
Also Read : 8 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. సంచలన రిపోర్ట్!
నాగ్‌పూర్ లోని ఫాగో పాటిల్ లేఅవుట్, నాగ్ మందిర్ టెక్డి సమీపంలో ఉన్న గోధాని నగర్ పంచాయతీ నీటి శుద్ధి కేంద్రంలో ఉన్న 900 కిలోల క్లోరిన్ గ్యాస్ సిలిండర్ నుండి రాత్రి 1 గంట సమయంలో లీకేజీ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. వాయువు వేగంగా పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మూలంగా ప్లాంట్‌లో పనిచేసే 8-10 మంది ఉద్యోగులు, మరో 50 మంది స్థానికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ప్రస్తుతం సుమారు 60 మంది బాధితులు స్పర్ష్, మేయో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్లాంట్‌లోకి వెళ్లి గ్యాస్‌ను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించారు. ఉదయం 5.30 గంటల సమయంలో గ్యాస్ లీకేజీ తగ్గడంతో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, ఆరెంజ్ సిటీ వాటర్‌వర్క్స్ ఉద్యోగుల సహాయంతో ఆ క్లోరిన్ సిలిండర్‌ను కాస్టిక్ సోడా కలిపిన నీటి తొట్టిలో ఉంచారు. ముందుజాగ్రత్త చర్యగా ఉదయం 11 గంటల వరకు ప్లాంట్‌కు కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని పోలీసులు స్థానికులకు సూచించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో పలువురిని చికిత్స కోసం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మంకాపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని పోలీసులు తెలిపారు
కాగా గ్యాస్ ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో పలు వీధి కుక్కలు మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే వాటి మరణానికి క్లోరిన్ లీకేజీనే కారణమని ఇప్పటివరకు నిర్ధరాణ జరగలేదని అధికారులు వెల్లడించారు. క్లోరిన్ వాయువు ఎందుకు లీకైంది, ట్యాంకర్‌లో ఏ లోపం ఏర్పడింది అనే విషయాలు ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం వల్ల ప్రభావితమైన వారి వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు.
Also Read : వంకాయ కూరతో చపాతీలు తిన్న చిన్నారులు.. ముగ్గురు అనుమానస్పద మృతి









