Abhijeet Dipke  : అమెరికాలో తన ఉన్నత విద్యకు సంబంధించిన ఖర్చులపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) గట్టిగా స్పందించారు. విదేశాల్లో చదువుకోవడానికి తాను కుటుంబ ఆర్థిక సహాయంపై ఆధారపడలేదని, బోస్టన్ యూనివర్సిటీ అందించిన మెరిట్ స్కాలర్‌షిప్‌తో పాటు తీసుకున్న విద్యా రుణం (Education Loan) ద్వారానే చదువును పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఓ ప్రముఖ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాను తీసుకున్న విద్యా రుణానికి సంబంధించిన వాయిదాలను (EMIs) ప్రస్తుతం క్రమంతప్పకుండా తిరిగి చెల్లిస్తున్నానని వివరించారు.

ఇటీవల సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ, అభిజీత్ దీప్కే కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై మరియు విదేశీ విద్యా ఖర్చులపై వివిధ దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఆరోపణలపై సిజెపి ప్రతినిధి వైష్ణవి గౌర్ తీవ్రంగా మండిపడ్డారు. ఒక యువ నాయకుడి వ్యక్తిగత విద్యా ఖర్చులపై లేనిపోని ప్రశ్నలు లేవనెత్తే వారు, దేశంలో జరుగుతున్న ఇతర నిధుల దుర్వినియోగం, విద్యా రంగంలో అక్రమాలపై ఎందుకు దృష్టి సారించడం లేదని ఆమె ప్రశ్నించారు.

ఇదే సమయంలో పార్టీకి అందుతున్న నిధుల పారదర్శకతపై కూడా అభిజీత్ దీప్కే స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాల కోసం క్రౌడ్‌ ఫండింగ్ (Crowd Funding) ద్వారా మాత్రమే ప్రజల నుంచి నేరుగా విరాళాలు సేకరిస్తామని, ప్రతి ఒక్క రూపాయి లెక్కను ప్రజాబాహుల్యంలో పారదర్శకంగా వెల్లడిస్తామని చెప్పారు. నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్‌కు వ్యతిరేకంగా చేపట్టిన సుదీర్ఘ పోరాటంలో సైతం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసనకారులకు ఆహారం, తాగునీరు అందించి మద్దతు తెలిపారని గుర్తుచేశారు.

ఇటీవల నిర్వహించిన వరుస నిరసనల తర్వాత తమ పార్టీపై, బాధ్యత మరింత పెరిగిందని అభిజీత్ దీప్కే అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలు, ముఖ్యంగా విద్యార్థుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో సిజెపి (CJP) బృందాన్ని మరింత విస్తరిస్తామని వెల్లడించారు. దేశంలో నాణ్యమైన విద్య సాధారణ, పేద ప్రజలకు అందుబాటులో లేనంత ఖరీదుగా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాబోయే రోజుల్లో విద్య, ఉపాధి రంగాలలో సంస్కరణల కోసం ఉద్యమాలను దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ప్రకటించారు.

Also Read : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. ప్రశాంత్ కిశోర్ ఘన విజయం!

శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించకుండా నమోదు చేసిన క్రిమినల్ ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులను నేరస్థులుగా చిత్రీకరించడం సరికాదని హితవు పలికారు. మరోవైపు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే దీప్కే, స్నేహితుల దినోత్సవం (Friendship Day) సందర్భంగా ఛత్రపతి సంభాజీనగర్‌లో చిన్నపిల్లలతో కలసి ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఆగస్ట్ 5న కీలక సమావేశం
కాక్రోచ్‌ జనతా పార్టీ తన తదుపరి భవిష్యత్‌ కార్యాచరణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్న అభిజీత్ దీప్కే నివాసంలో ఈ నెల 5వ తేదీన (ఆగస్టు 5) సిజెపి కోర్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందుగా వివిధ జిల్లాల వాలంటీర్లు, విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయాలను సేకరించి రావాలని కోర్ కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు.

ఆగస్టు 5న జరిగే ఈ కీలక భేటీలో ముఖ్యంగా విద్యార్థులపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి ఏ విధంగా తీసుకెళ్లాలి? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తమ భవిష్యత్తు ప్రణాళికలు, తదుపరి ఆందోళన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 (NEET-UG 2026) పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అప్రమత్తమైంది. పరీక్షల భద్రతను అత్యున్నత స్థాయిలో కట్టుదిట్టం చేసేందుకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, సర్వర్ గదులు, స్ట్రాంగ్‌రూమ్‌లు, ప్రశ్నపత్రాల నిల్వ కేంద్రాలకు 24 గంటల పాటు నిరంతర భద్రత కల్పించేందుకు సుమారు రూ. 7.5 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. రెండేళ్ల ఒప్పంద కాలానికి అమలయ్యే ఈ భద్రత, హౌస్‌కీపింగ్ మరియు సెక్యూర్ ప్రింటింగ్ (భద్రతా ప్రమాణాలతో కూడిన ముద్రణ) టెండర్ల ప్రక్రియకు ఆగస్టు 17 వరకు బిడ్లను స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.

Also Read : BJPకి దిమ్మతిరిగే షాక్.. 30 ఏళ్ల కంచుకోట బద్దలు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.