Uttar pradesh Deoria ambulance accident
Uttar pradesh Deoria ambulance accident

తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన తన తమ్ముడిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చేందుకు అన్నయ్య, కొడుకు బయల్దేరారు. కానీ ఒకటి కాదు.. ఏకంగా మూడు మృతదేహాలు ఇంటికి వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. అంబులెన్స్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తున్నారు. మరోవైపు మృతుడికి నివాళులర్పించేందుకు ఎదురుచూస్తున్న గ్రామస్తులు.. అంబులెన్స్ ఎంత దూరం వచ్చింది?.. ఇంకా ఎంత సేపు పడుతుంది?.. అనుకుంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ మరణించిన తమ్ముడిని తీసుకు రావడానికి వెళ్లిన అన్నయ్య, కొడుకు కూడా అందరినీ వదిలి అనంతలోకాలకు వెళ్లిపోతారని వారికి తెలియదు. వారు ప్రయాణిస్తున్న అంబులెన్స్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మృతుడి అన్నయ్య, కొడుకుతో పాటు అంబులెన్స్ డ్రైవర్, సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరి మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబం.. ఇప్పుడు ముగ్గురు ప్రియమైన వారి అంత్యక్రియలను చూసింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : దృశ్యం 3 సినిమా చూసి హత్య.. ఒక్క ఫోన్‌కాల్‌తో మొత్తం ప్లాన్‌ రివర్స్‌!

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా రుద్రపూర్ పట్టణం గహిలా-దుధైలా గ్రామానికి చెందిన సత్యవాన్ సింగ్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్ మేజర్‌గా, అతని అన్నయ్య రామ్ సముజ్ సింగ్ తపాలా శాఖలో పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసేవారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఆ గ్రామంలోనే వారి అనుబంధం ప్రత్యేకమైనదిగా ఉండేది. ఇద్దరికీ పెళ్లిల్లు అవగా.. జవాన్ సత్యవాన్ సింగ్‌కు భార్య, కొడుకు గౌరవ్ సింగ్ ఉన్నారు. రామ్‌సముజ్‌సింగ్‌కు భార్య శీలా దేవి, ముగ్గురు కుమారులు వివేక్, వికాస్, వినీత్ ఉన్నారు.

అందరూ వారి పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో జవాన్ సత్యవాన్ సింగ్‌కు అనారోగ్యం తలెత్తింది. కిడ్నీ వ్యాధి కారణంగా అతడు చండీగఢ్‌లోని పంచకులలో చికిత్స పొందుతున్నాడు. అతను త్వరగానే కోలుకుంటాడని.. అతని ఫ్యామిలీ కూడా ఎంతో ఆశతో ఎదురుచూసింది. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. శనివారం జవాన్ సత్యవాన్ సింగ్ మరణించాడు. హాస్పిటల్‌లో మృతి చెందిన తమ్ముడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చేందుకు రామ్‌ సముజ్‌సింగ్, సత్యవాన్ 18 ఏళ్ల కుమారుడు గౌరవ్ సింగ్ చంఢీగఢ్‌కు వెళ్లారు. ఆదివారం అక్కడ నుండి అంబులెన్స్‌లో సత్యవాన్ సింగ్ మృతదేహంతో అన్నయ్య రామ్ సముజ్, కొడుకు గౌరవ్ ఎక్కారు. కానీ అదే వారి ఆఖరి ప్రయాణం అవుతుందని ఊహించలేకపోయారు.

Also Read : ఏపీలో ఇరుముడి సినిమా రిపీట్.. అక్కడ టీచర్.. ఇక్కడ వంట మనిషి!

తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు. ఇంటికి ఫోన్ చేసి డెడ్ బాడీతో వచ్చేస్తున్నామని సమాచారం అందించారు. దీంతో ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జవాన్‌కు నివాళులర్పించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులంతా మృతుడి ఇంటికి చేరుకున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు గంట గంటకి ఫోన్లు చేస్తూ.. ఎక్కడి వరకు వచ్చారు?.. ఇంకా ఎంత సమయం పడుతుంది? అని కనుక్కునేవారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో సుల్తాన్‌పూర్ జిల్లాలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఒక్కరు కూడా ప్రాణాలతో బతకలేదు. తండ్రి మృతదేహంతో ఇంటికి తిరిగి వస్తున్న కుమారుడు, అతని అన్నయ్య ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ జస్పాల్, సిబ్బంది రాజన్ చౌదరి కూడా చనిపోయారు.

జవాన్ సత్యవాన్ సింగ్ మృతదేహం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు, గామస్తులు మళ్లీ ఫోన్ చేసినపుడు.. అవతలవైపు నుంచి వచ్చిన సమాధానం ఎవరూ ఊహించి ఉండరు. వారు ప్రయాణిస్తున్న అంబులెన్స్ ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణిస్తున్న వారందరూ చనిపోయారని తెలియడంతో భార్య, కొడుకుల వేదన తీర్చలేనిదిగా మారింది. రామ్‌సముజ్ సింగ్ భార్య శీలా దేవి తన భర్త మరణవార్త విని కుప్పకూలిపోయింది. ఆమె ముగ్గురు కుమారులు కూడా తండ్రి లేనివారయ్యారు. మరోవైపు సత్యవాన్ కుటుంబం తమ కుమారుడు గౌరవ్ మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఒకవైపు తండ్రి మృతదేహం, మరోవైపు అతని కుమారుడి మృతదేహం. మూడోవైపు తన తమ్ముడి డెడ్ బాడీని ఇంటికి తీసుకురావడానికి అన్నయ్య మృతదేహం ఒక దగ్గరే ఉన్నాయి. ఒకరి అంత్యక్రియలు జరగాల్సిన ఆ ఇంట్లో.. ముగ్గురు ప్రియమైన వారి చివరి వీడ్కోలుకు ఏర్పాట్లు చేశారు. సైనికాధికారుల సమక్షంలో సత్యవాన్ సింగ్ మృతదేహానికి సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ షాహి కూడా వెళ్లి మృతునికి నివాళులర్పించారు. ఆ జనసమూహం మధ్య మూడు మృతదేహాలు ఉండటం అందరినీ తీవ్రంగా కలచివేసింది.