
Terror Network : పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతుతో భారతదేశంలో భారీ వినాశనానికి కుట్ర పన్నిన ఒక అంతర్జాతీయ ఉగ్ర గూఢచార ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. దేశ భద్రతకు అత్యంత ముప్పుగా మారిన ఈ ముఠాకు చెందిన ఏడుగురు కీలక సభ్యులను పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఆరుగురు ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందినవారు కావడం గమనార్హం. భారత సైన్యం కదలికలపై నిఘా ఉంచడం, నకిలీ సిమ్ కార్డులు – ఓటీపీ రాకెట్ నిర్వహించడం, దేశ రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని సరిహద్దులు దాటించడమే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
రైల్వే స్టేషన్లలో సోలార్ సీసీటీవీల నిఘా!
భారత సైనికుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ ముఠా అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించింది. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్న ప్రముఖ రైల్వే స్టేషన్ల వద్ద రహస్యంగా సోలార్‌తో పనిచేసే సీసీటీవీ కెమెరాలను అమర్చడానికి వీరు వ్యూహం పన్నారు. ఇప్పటికే వీరు ఢిల్లీ కాంట్, హర్యానాలోని సోనిపట్ రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ఇటువంటి నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన నిందితుల నేపథ్యాన్ని తవ్వితీస్తున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గాజియాబాద్‌లో పట్టుబడిన ఆరుగురిలో నలుగురు గతంలో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతాన్ని సందర్శించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
అక్కడి వ్యూహాత్మక ప్రాంతాల నుంచి సేకరించిన అత్యంత రక్షణ సమాచారాన్ని వీరు పాకిస్థాన్‌కు చేరవేసినట్లు బలమైన ఆధారాలు లభించాయి. గతంలో జరిగిన పుల్వామా తరహాలోనే భారత్‌లో మరో ఘోరమైన ఉగ్రదాడికి ఐఎస్ఐ స్కెచ్ వేసిందా? అనే కోణంలో నిఘా వర్గాలు, పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.ఈ ముఠా కేవలం క్షేత్రస్థాయి నిఘాకే పరిమితం కాకుండా సైబర్ నేరాల ద్వారా పాక్ ముఠాలకు సహకరించింది. గతంలోనే యాక్టివేట్ అయిన సిమ్ కార్డులను అక్రమంగా కొనుగోలు చేసి, వాటికి వచ్చే ఓటీపీలను (OTPs) విదేశాల్లోని తమ హ్యాండ్లర్లకు పంపేవారు. తద్వారా భారతీయ నంబర్లపై వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఖాతాలను విదేశీయులు నిర్వహించేందుకు వీలు కల్పించారు.ఒక్కో ఓటీపీ లేదా అకౌంట్ వెరిఫికేషన్ కోసం వీరు రూ. 500 నుండి రూ. 5,000 వరకు వసూలు చేసినట్లు తేలింది.
పోలీసుల కళ్లుగప్పేందుకు ‘క్యాష్’ రూట్!
తమ ఆర్థిక లావాదేవీలు పోలీసుల నిఘాలో పడకుండా ఉండేందుకు ఈ ఉగ్ర గూఢచారులు అత్యంత తెలివిగా వ్యవహరించారు. డిజిటల్ నెట్‌వర్క్‌లో దొరికిపోతామనే భయంతో వీరు తమ సొంత బ్యాంకు ఖాతాలను వాడలేదు. స్థానిక జనసేవా కేంద్రాలు, చిన్న చిన్న కిరాణా దుకాణాల ద్వారా కేవలం నగదు (Cash) రూపంలోనే డబ్బులు తీసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా నెట్‌వర్క్ నడిపారు. దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అంతర్జాతీయ ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొంత మంది స్థానిక వ్యక్తుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని, త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.









