
Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీపై విద్యార్థి అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతి క్షమాపణలు కోరుతూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ యువతి చేతులు జోడించి కన్నీళ్లతో తన తప్పును ఒప్పుకుంది. ఆందోళన సమయంలో కొందరి ప్రభావం వల్లనే తాను ప్రధాని మోదీపై నోరుజారి తప్పుగా మాట్లాడానని ఆ వీడియోలో ఆమె పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లో తన వయస్సు 25 సంవత్సరాలుగా రాసినప్పటికీ, తాను మాత్రం కేవలం 15 ఏళ్ల బాలికినేనని ఆమె స్పష్టం చేసింది. తాను చేసిన పని క్షమించరానిదని, దేశం మొత్తం తనను క్షమించాలని వేడుకుంది. తన జీవితంలో ఇది మొదటి, చివరి తప్పిదమని, తనను తాను చూసుకోలేనంతగా సిగ్గుపడుతున్నానని, దయచేసి తనను క్షమించాలని కోరింది.
కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నోయిడా పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. తొలుత నోయిడా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఆ తర్వాత ఆ కేసును న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రధాని పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు కించపరిచాయని, దీనివల్ల సమాజంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని ఫిర్యాదుదారు తెలిపారు.
విద్యార్థుల ఆందోళనల సమయంలో తనపై జరిగిన అనుచిత వ్యాఖ్యలపై సంయమనం పాటించాలని, క్షమించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసిన కొద్ది గంటలకే ఈ యువతి క్షమాపణ వీడియో బయటకు రావడం గమనార్హం.
Also Read : రీల్స్‌తోనే సరిపెడతారా..కేసులు ఎత్తేయ్యరా… ప్రధాని మోడీ పై సీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఆ వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏ సమస్యకు కూడా తిట్లు లేదా దుర్భాషలాడటం పరిష్కారం కాదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించడం కంటే, వారికి సరైన మార్గం చూపాలని సమాజానికి విజ్ఞప్తి చేశారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటనను దేశం మొత్తం చూసిందని, ఎలాంటి నాగరిక సమాజంలోనూ చోటు లేని భాషను కొందరు తప్పుదోవ పట్టిన యువకులు ఉపయోగించారని అన్నారు. తనను, తన దివంగత తల్లిని కూడా దూషించారని ఆయన తెలిపారు.
అయితే అలా తిట్టిన వారు కేవలం తప్పుదోవ పట్టినవారేనని, వారిపై కోపం పెంచుకోవడం లేదా ప్రతీకారం తీర్చుకోవడం సరైన మార్గం కాదని ప్రధాని అభిప్రాయపడ్డారు. చిన్నతనంలో తప్పులు జరుగుతుంటాయని, ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా యవ్వనమే ఇస్తుందని ఆయన అన్నారు. సమాజంలో ఆవేదన ఉందని తనకు తెలుసని, కానీ ఇది ఆ పిల్లలను హత్తుకుని సరైన దారిలో పెట్టాల్సిన సమయమని చెప్పారు. వారికి శిక్షలు వేయడం, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధించడం వల్ల ఎలాంటి మార్పు రాదని స్పష్టం చేశారు.
బాధ్యులైన వారిని తాను క్షమించదలుచుకున్నానని, సమాజం కూడా తన మాటన మన్నించి వారిని క్షమించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. తిట్లు ఏ సమస్యను పరిష్కరించలేవని, దారి తప్పిన వారికి మార్గదర్శనం చేద్దామని, మన దేశం కోసం అందరం కలిసికట్టుగా శ్రమిద్దామని ఆయన పిలుపునిచ్చారు.
Also Read : 17 ఏళ్లకు తీర్పు.. జమ్ము కశ్మీర్ సీఎంకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు!









