GOBARdhan : వ్యవసాయ వ్యర్థాలు,సేంద్రీయ వ్యర్థాలను ఉపయోగించి దేశీయ ఇంధన వనరుగా మార్చేందుకు ఉద్దేశించిన ‘గోబర్ధన్’ (జాతీయ వృత్తాకార బయోఎనర్జీ పథకం) పథకానికి కేబినెట్ ఆమోదం లభించింది. 2026-27 నుండి 2035-36 వరకు అమలయ్యే ఈ పథకం ద్వారా దేశీయ బయోగ్యాస్‌( సీబీజి) ఉత్పత్తిని పది రెట్లు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ఇంధన భద్రత బలపడటంతోపాటు, ప్రైవేట్ పెట్టుబడులు పెరిగి, గ్రామీణ భారతదేశంలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.

భారతదేశంలో వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, మున్సిపల్ సేంద్రీయ వ్యర్థాలు వంటివి వృధాగా పోతున్నాయి. ఈ వ్యర్థాలను వినిగియోగించుకునేందుకు గోబర్ధన్ పథకం రూపొందించారు. తద్వారా సీబీజి, సేంద్రీయ ఎరువులుగా మార్చనున్నారు. సహజ వాయువుతో సమానమైన రసాయన గుణాలు కలిగిన సీబీజిని భారతదేశంలోని ప్రస్తుత గ్యాస్ వ్యవస్థలోనే ఉపయోగించుకునే అవకాశం ఉంది. దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, గ్యాస్ ఉత్పత్తిని పెంచుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

గతంలో ఈ పథకం అమలైనప్పటికీ ఆ తర్వాత సరైన ఆధారణ లేక కుంటుపడింది. అందుకే సీబీజి ప్రాజెక్ట్‌లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన డిమాండ్ కచ్చితత్వం, ధరల నిర్ణయం, పెట్టుబడి నిధులు, మౌలిక వసతులు ,స్థానిక పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో భాగంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సీబీజిని కొనుగోలు చేసేలా ‘సీబీజి ఆఫ్ టేక్ అస్యూరెన్స్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సీబీజి మిశ్రమ నిబంధనలు (బ్లెండింగ్ ఆబ్లిగేషన్) 2026-27 నాటికి 3%, 2027-28 నాటికి 4%, FY2028-29 నుండి 5%గా ఉండేలా రూపొంచారు.

Also Read : ఆ సమయంలోనే NEET పేపర్ లీక్.. CBI ఛార్జ్షీట్లో సంచలన నిజాలు

ఉత్పత్తిదారులకు ఎల్లపుడు స్థిరమైన రాబడిని అందించడానికి ప్రభుత్వం MMBTUకి రూ. 2,110 చొప్పున సీబీజికి ప్రామాణిక ధరను నిర్ణయించడం గమనార్హం. ఈ ధరల విధానం కనీసం 10 సంవత్సరాల పాటు అమల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, గ్రీన్ఫీల్డ్ సీబీజి ప్రాజెక్ట్‌లకు ఇన్‌స్టాల్ చేసే సామర్థ్యం ఆధారంగా టన్నుకు (TPD) రూ. 2 కోట్ల వరకు మూలధన సహాయం (క్యాపిటల్ అసిస్టెన్స్) లభించనుంది. బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌లు తమ సామర్థ్యాన్ని విస్తరించుకోవడానికి కూడా ఈ సబ్సిడీ వర్తించేలా ఏర్పాటు చేశారు.

పరిశ్రమ ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిష్కరించడానికి, సీబీజి ప్లాంట్‌లను ట్రంక్ పైప్‌లైన్‌లు,.సిటీ గ్యాస్ నెట్‌వర్క్‌లతో అనుసంధానించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా, MSME ఆధారిత సీబీజి ప్రాజెక్ట్‌ల కోసం క్రెడిట్ గ్యారెంటీ మెకానిజమ్‌ను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా చిన్న స్థాయి పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందే అవకాశం లభించనుంది.

‘సీబీజి ఎకోసిస్టమ్ ఛాలెంజ్ ఫండ్’ ద్వారా జిల్లా స్థాయిలో కూడా సరఫరా చైనును అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. బయోమాస్ లభ్యతను గుర్తించడం, జిల్లా స్థాయి ప్రణాళికలు ,సేంద్రీయ ఎరువుల విలువ జోడింపు వంటి అంశాలకు ఈ నిధుల ద్వారా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.

ప్రభుత్వం ఇప్పటికే 200లకు పైగా సీబీజి ప్లాంట్‌లను ఏర్పాటు చేసింది. అయితే జాతీయ స్థాయిలో ఈ రంగాన్ని విస్తరించాలంటే ముడిసరుకు నిరంతరం అందాలి. అలాగే ఆర్థిక సహాయం, గ్యాస్ నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేయడం చాలా ముఖ్యం. నిర్దేశించుకున్న పదేళ్ల అమలు కాలంలో ఈ పథకం సరిగ్గా అమలైతే, సీబీజి భారతదేశ ఇంధన రంగంలో ఒక కీలకమైన ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని ప్రభుత్వం అశాభావం వ్యక్తం చేస్తోంది.

Also Read : రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల విరాళాలు రూ.1820కోట్లు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.