Paraquat : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటూ, భారత రైతాంగానికి తీరని నష్టం చేకూరుస్తున్న పారాక్వాట్ (Paraquat Dichloride) గడ్డిమందుపై దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి నిషేధం విధించింది. ప్రాణాంతక రసాయనంగా మారిన ఈ కలుపు నాశిని అమ్మకాలు, పంపిణీని తక్షణమే నిలిపివేస్తూ జూలై 14, 2026న వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కీటకనాశన చట్టం 1968, సెక్షన్ 27 కింద దీని దిగుమతి, తయారీ, రవాణా, వినియోగాలపై పూర్తి నిషేధం అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే, తయారీ సంస్థల విజ్ఞప్తులు, సూచనల కోసం ఆగస్టు 13 వరకు (30 రోజుల వ్యవధి) గడువు ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 70కి పైగా దేశాలు పారాక్వాట్‌ను నిషేధించగా, భారతదేశంలో మాత్రం దీని విక్రయాలు యథేచ్ఛగా కొనసాగాయి. తక్కువ ధరకు లభించడం, పిచికారీ చేయగానే వేగంగా కలుపును నాశనం చేసే గుణం ఉండటంతో తెలంగాణలో పత్తి, వరి, మొక్కజొన్న సాగు చేసే రైతులు దీనిపై ఎక్కువగా ఆధారపడ్డారు. అయితే, ఈ రసాయనం మానవ ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించారు. దీని ప్రభావం వల్ల కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా దీర్ఘకాలంలో పార్కిన్సన్ (Parkinson’s) వంటి నాడీ సంబంధిత తీవ్ర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

గణాంకాల ప్రకారం ఈ విషపూరిత గడ్డిమందు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే నెలకు సగటున 20 మందికి పైగా రైతులు, కూలీలు ఈ రసాయనం వల్ల సంభవించే ప్రమాదాలు లేదా విషప్రయోగం బారిన పడి మరణిస్తున్నట్లు అంచనా. ఈ తీవ్ర పరిస్థితుల దృష్ట్యా, పారాక్వాట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేయాలని కోరుతూ ‘ది మైఖేల్ జె. ఫాక్స్ ఫౌండేషన్’, పలువురు వైద్యులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ (ఈ మందు వల్ల తన సోదరుడిని కోల్పోవడంతో) ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

గతంలోనే కొన్ని రాష్ట్రాలు పారాక్వాట్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించాయి. 2003లో ఒడిశా దీనిపై తాత్కాలిక నిషేధం విధించగా, కేరళ ప్రభుత్వం సైతం ప్రయత్నించి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. ఈ రసాయన ముప్పును గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2026 మార్చి 30న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, ఏప్రిల్ 1 నుంచి 60 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించింది. అయితే, చట్టప్రకారం రాష్ట్రాలకు శాశ్వతంగా నిషేధించే అధికారం లేకపోవడంతో, కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చివరకు ఈ నిషేధ ఫైలుపై సంతకం చేశారు.

పారాక్వాట్ నిషేధంతో రైతుల ప్రాణాలకు రక్షణ లభించినప్పటికీ, వ్యవసాయ రంగంలో కొన్ని ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న ఇతర కలుపు నివారణ మందుల ధరలు 2 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ రసాయనాలు వాడకుండా కూలీలతోనే కలుపు తీయించాల్సి వస్తే, సాగు ఖర్చు ఏకంగా వంద రెట్లు పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గతంలో తాత్కాలిక నిషేధాలు అమలులో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి దొంగచాటుగా పారాక్వాట్ స్మగ్లింగ్ జరిగి రైతులకు విక్రయించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి, ఈ కేంద్ర ప్రభుత్వ నిషేధం క్షేత్రస్థాయిలో కఠినంగా అమలుకావాలంటే సరిహద్దుల వద్ద తనిఖీలను తీవ్రతరం చేయడంతో పాటు, నకిలీ, నల్లబజారు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో, రైతులకు భారం కాకుండా సరసమైన ధరల్లో సురక్షితమైన ప్రత్యామ్నాయ కలుపు మందులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.