India High Altitude Satellite : టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఆధునిక కాలంలో యుద్ధం అంటే కత్తులు పట్టుకుని సూర్యోదయం నుంచి సూర్యస్తమయం వరకు చేసే కాలం కాదు. మోడరన్ ఏజ్‌లో వార్ ప్లానింగ్ , స్ట్రాటజీ కూడా పూర్తిగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు ఫైటర్ జెట్లు, మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దాటి టెక్నాలజీని చూశాం. కానీ, ఇపుడు అది కూడా దాటి ముందుకు వెళ్ళింది. ఇప్పుడంతా డ్రోన్ల యుగం సడుస్తోంది. భవిష్యత్తులో స్పేస్ వార్ (అంతరిక్ష యుద్ధం) జరిగే ముప్పును కూడా కాదనలేం. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు ఈ దిశగా అడుగులు వేస్తు్న్నాయి కూడా.

ఈ దశలోనే మనదేశం కూడా అంతరిక్షం నుండి శత్రువులపై నిఘా ఉంచేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పాకిస్తాన్ అంతర్గత భాగాలపై 24 గంటలూ నిఘా ఉంచేందుకు వీలుగా భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తలు ప్రత్యేక శాటిలైట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, దీనికోసం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించాల్సిన అవసరం కూడా లేదు. ఆకాశం నుంచే ఆసిమ్ మునీర్ బెడ్‌రూమ్‌పై కూడా నిఘా పెట్టడానికి అవకాశం ఉంది. పాకిస్తాన్ వ్యూహాలను ధ్వంసం చేయడానికి మిసైల్స్ కూడా అవసరం లేదు, అలా అని శత్రుదేశ భూభాగంలోకి ఫైటర్ జెట్లను పంపాల్సిన పనీ కూడా లేదు. భారత్ హై-ఆల్టిట్యూడ్ సూడో-శాటిలైట్స్ (HAPS) ప్రాజెక్ట్‌ను వేగంగా అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు వేగంగా పనిచేస్తున్నారు.

భారతదేశం తన సైనిక నిఘా, ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడానికి హై-ఆల్టిట్యూడ్ సూడో-శాటిలైట్స్ (HAPS) టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు వేగంగా కృషి చేస్తోంది. అంతరిక్షంలో ఉండే సాంప్రదాయ ఉపగ్రహాలకు, సాధారణ డ్రోన్లకు మధ్య ఒక వారధిలా HAPS పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌరశక్తితో నడిచే ఈ విమానాలు 17 నుండి 25 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతాయి. అంతేకాదు అవి అనేక వారాలు లేదా నెలల పాటు నిరంతరం గాలిలోనే ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

భారతదేశ స్వదేశీ HAPS కార్యక్రమంలో ఇటీవల కీలక పురోగతి సాధించింది. CSIR నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) 12 మీటర్ల వింగ్ స్ప్యాన్ కలిగిన సబ్-స్కేల్ ప్రోటోటైప్‌ను 8 గంటలకు పైగా విజయవంతంగా నడిపించి సత్తా చాటింది. ఇప్పుడు దాదాపు 30 మీటర్ల వింగ్ స్ప్యాన్ కలిగిన పూర్తి స్థాయి HAPSను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.. దీన్ని 2027 నాటికి 90 రోజుల పాటు నిరంతరం గాలిలో ఎగరే సామర్థ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రక్షణ సేకరణ మండలి (DAC) కూడా సాయుధ బలగాల కోసం HAPS కొనుగోళ్లకు ఆమోదం తెలిపడం గమనార్హం.

Also Read : 7 రాష్ట్రాల ఎన్నికల్లో ‘Gen Z’ భయం.. గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం

HAPS ప్రత్యేకత ఏంటీ?

HAPS ల అతిపెద్ద బలం అవి అత్యధిక ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం. ‘డిఫెన్స్ డాట్ ఇన్’ నివేదిక ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌లు సాధారణ ఎయిర్‌క్రాఫ్ట్ ట్రాఫిక్ , చెడు వాతావరణం కంటే చాలా పైన స్ట్రాటోటోస్పియర్‌లో ఎగురుతాయి. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 (F-16), జెఎఫ్-17 (JF-17) వంటి యుద్ధ విమానాలు సాధారణంగా 50,000 నుండి 60,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. దీనివల్ల 70,000 నుండి 80,000 అడుగుల ఎత్తులో నిరంతరం ఎగురుతున్న HAPSను సంప్రదాయ యుద్ధ విమానాల ద్వారా అడ్డుకోవడం వాటికి సాధ్యం కాదు.

అయితే, అంత ఎత్తులో ఉండటం వల్ల HAPS పూర్తిగా సురక్షితమని చెప్పలేం. సుదూర ప్రాంతాలను చేధించే ఆధునిక ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు (SAM) 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒకవేళ HAPS ఏదైనా అత్యంత సురక్షితమైన సైనిక ప్రాంతంపై ఎగిరితే, శక్తివంతమైన రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు దానిని గుర్తించే అవకాశం ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో హై-ఆల్టిట్యూడ్ క్షిపణులు, లేజర్లు ,ఎలక్ట్రానిక్ జామింగ్ వంటి టెక్నాలజీలు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌లకు సవాలుగా మారే అవకాశం ఉంది.

ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ఖర్చు పరంగా HAPS వల్ల ఒక ప్రధాన వ్యూహాత్మక ప్రయోజనం కూడా ఉంది. తేలికైన, ఆయుధాలు లేని, సౌరశక్తితో నడిచే ప్లాట్‌ఫారమ్‌ను నాశనం చేయడానికి కోట్లాది రూపాయల విలువైన ఖరీదైన ఇంటర్‌సెప్టర్ క్షిపణిని ఉపయోగించడం ప్రత్యర్థి దేశానికి ఆర్థికంగా భారంగా మారనుంది. సైనిక వ్యూహంలో దీనిని ‘కాస్ట్-ఎక్స్ఛేంజ్ ఇంబ్యాలెన్స్’ (ఖర్చుల అసమతుల్యత) అంటారు.

భారతదేశంలో HAPS అత్యంత ప్రభావవంతమైన ఉపయోగం ఏమిటంటే, వేరే దేశ గగనతలంలోకి ప్రవేశించకుండానే ‘స్టాండ్-ఆఫ్’ నిఘా నిర్వహించవచ్చు. దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తు నుండి దీని కళ్ళు వందలాది కిలోమీటర్ల దూరం వరకు చూడగలిగే సామర్ధ్యం కలిగి ఉంటాయి. అత్యాధునిక కెమెరాలు, థర్మల్ సెన్సార్లు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ పరికరాలతో కూడిన HAPS, భారతీయ భూభాగంలోనే ఉంటూ పొరుగు దేశంలోని సైనిక స్థావరాలు, సైనికుల కదలికలు, ఎయిర్‌బేస్‌లు ,లాజిస్టిక్ మార్గాలపై నిఘా ఉంచగలుగుతాయి.

HAPS ద్వారా వేరే దేశ గగనవిధుల ఉల్లంఘన, దాని వల్ల రాజకీయ లేదా సైనిక ఉద్రిక్తతలు చెలరేగే ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, మారుమూల ప్రాంతాలలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడానికి, విపత్తు నిర్వహణలో, సరిహద్దు ప్రాంతాలలో సైనికుల కోసం ‘ఫ్లోటింగ్ సెల్ టవర్’గా కూడా HAPSను ఉపయోగించుకోవచ్చు.

భారతదేశంలో HALతో పాటు ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీలు కూడా ఈ టెక్నాలజీ అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. దాదాపు 15,000 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దు.సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న భారతదేశానికి, HAPS అంతరిక్ష ఆధారిత ఖరీదైన నిఘా వనరులకు ,తక్కువ దూర డ్రోన్లకు మధ్య ఒక ముఖ్యమైన సాంకేతిక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. నిరంతరం ఎత్తులో ఉండి నిఘా పెట్టే సామర్థ్యం కారణంగా, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశ సరిహద్దు భద్రత ,సైనిక ఇంటెలిజెన్స్ వ్యూహానికి సరికొత్త దిశను నిర్దేశించగలవని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : You Tube కొత్త రూల్స్ : కంటెంట్ క్రియేటర్లకు బిగ్ షాక్.. పెరిగిన వాచ్ అవర్స్!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.