Abhijeet Dipke :  కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే తండ్రి ఆర్థిక మూలాలపై విచారణ జరపాలని సూరత్‌కు చెందిన రైట్ టూ ఇన్ఫర్మేషన్ కార్యకర్త కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్డ్ ఉద్యోగిగా పనిచేసిన ఆయన, తన కుమారుడి విదేశీ విద్య కోసం నిధులను ఎలా సమకూర్చారనే దానిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ అధికారులను ఆశ్రయించారు.

ఢిల్లీ పోలీసులచే అరెస్ట్ చేయబడిన సీజేపీ నిరసనకారుల కోసం సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన రూ. 1 కోట్ల లీగల్ డిఫెన్స్ ఫండ్‌పై కూడా విచారణ జరపాలని అమిత్ తివారీ ఎన్నికల సంఘం, పన్ను అధికారులను కోరారు.

అభిజీత్ డిప్కే తండ్రి భగవాన్‌రావ్ డిప్కే ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తి కావడం, ఆయన కుమారుడు విదేశాల్లో హెయిర్ ఎడ్యూకేషన్ పూర్తి చేయడం వంటి అంశాలను ఉటంకిస్తూ తివారీ ఆయన ఆర్థిక పరిస్థితిపై పరిశీలన కోరారు.

అలాగే, సీజేపీ సంస్థ రాజకీయ పార్టీ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తూ నిధులు స్వీకరించే అర్హత ఉందా లేదా అనే అంశంపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

కాక్రోచ్ జనతా పార్టీ అనేది రిజిస్టర్ కాని సంస్థ అయినప్పటికీ, ఒక రాజకీయ పార్టీలాగా నడుస్తోంది. దీనికి రూ. 1 కోటి లీగల్ డిఫెన్స్ ఫండ్‌గా కేటాయించినట్లయితే, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29A ప్రకారం సీజేపీ ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిందా లేదా అని ఈసీ పరిశీలించాలి అని తివారీ అన్నారు.

ఒకవేళ రిజిస్టర్ కాకపోతే, రాజకీయ పార్టీ పేరుతో దాని కార్యకలాపాలు నిర్వహించడం, నిధులు లేదా రసీదులను స్వీకరించడంపై తనిఖీ అవసరం కావచ్చు అని ఆయన జోడించారు.

ఇదిలాఉండగా, కపిల్ సిబల్ ప్రతిపాదించిన లీగల్ డిఫెన్స్ ఫండ్ విరాళానికి జీఎస్టీ వర్తిస్తుందా లేదా అని పరిశీలించాలని కోరుతూ అమిత్ తివారీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్‌ను కూడా ఆశ్రయించారు.

నీట్ పేపర్ లీక్ వివాదంపై ఆందోళనల సమయంలో ఢిల్లీ పోలీసుల చేత అరెస్టయిన నిరసనకారులకు న్యాయ సహాయం అందించేందుకు సీజేపీ ఏర్పాటు చేసిన నిధికి సోమవారం కపిల్ సిబల్ రూ. 1 కోటి విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.