Uttar Pradesh : సినిమాల్లో మాత్రమే చూసే అరుదైన సీన్లు అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ ఎదురవుతుంటాయి. పెళ్లి చేసుకున్న భార్య వేరే ఒకరితో ప్రేమలో పడితే… గొడవలు పడటం, కోర్టులు ఎక్కడం లేదా చంపేయడం సాధారణంగా మన చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో అందుకు విరుద్దంగా ఓ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భార్య ప్రేమ వ్యవహారం, దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 21 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన భార్య మనసు మారడంతో, ఆమెను ఏమాత్రం బలవంతం చేయకుండా స్వయంగా గుడికి తీసుకెళ్లి ఆమె ప్రేమికుడితోనే పెళ్లి జరిపించాడు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు అంటూ వారిని సాగనంపిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : కూతురి లాంటి అమ్మాయిపై తేజ్‌పాల్ అఘాయిత్యం ..10 ఏళ్ల జైలు శిక్ష : ఇంతకు కేసు ఏంటి?

బుద్ధిరామ్ నిషాద్ అనే వ్యక్తికి, ఫూల్‌మతి అనే మహిళతో దాదాపు 21 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పట్లో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ దంపతుల కాపురం సజావుగానే సాగింది. వీరికి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. అంతా బాగుందనుకున్న సమయంలో వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఫూల్‌మతికి అదే గ్రామానికి చెందిన అవధేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం తెలిశాక భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో దాదాపు రెండు నెలల క్రితం ఫూల్‌మతి తన పిల్లలను, భర్తను వదిలేసి ప్రేమికుడు అవధేష్‌తో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయింది.

ఆ తర్వాత పెద్దలు, గ్రామస్తులు కల్పించుకుని నచ్చజెప్పడంతో ఆమె తిరిగి ఇంటికి వచ్చిందే కానీ, పాత బంధం మాత్రం నిలవలేదు. దీంతో ఆమె భర్త బుద్ధిరామ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నిత్యం నరకం అనుభవించే కంటే, ఆమె ఇష్టాన్ని గౌరవించడమే మంచిదని భావించాడు. గ్రామ పెద్దలు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అష్రఫ్‌పూర్ లోని శివాలయంలో ఫూల్‌మతి, అవధేష్‌లకు పెళ్లి జరిపించాడు. ఆ కొత్త జంటకు భవిష్యత్తు బాగుండాలని శుభాకాంక్షలు తెలిపి సాగనంపాడు. తల్లి వేరే వ్యక్తితో వెళ్ళిపోవడం, తండ్రి ఒక్కడే మిగలడంతో ఆ ఐదుగురు పిల్లల భవిష్యత్తు ఏంటి అన్నది ఇప్పుడు ఆ గ్రామంలో పెద్ద ప్రశ్నగా మారింది.

Also Read : దిమ్మతిరిగే షాక్.. ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ బంద్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.