
Dharmenedra Pradhan Statement: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా పార్లమెంట్‌కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్‌తో జరిపిన సంభాషణ ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు ఈ రాజీనామాను తమ విజయంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, ప్రధాన్ ఇచ్చిన ధీటైన సమాధానం ఆయన ఆత్మవిశ్వాసాన్ని, రాబోయే రాజకీయ ప్రణాళికలను స్పష్టంగా తెలియజేస్తోంది.సోమవారం పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ వద్దకు ముందుగానే చేరుకున్న ఎన్డీయే (NDA) ఎంపీలందరూ ధర్మేంద్ర ప్రధాన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. సగౌరవంగా లోపలికి తీసుకెళ్తూ, ఆయనకు సంఘీభావంగా ఒక సాంప్రదాయ టోపీని బహుకరించారు. ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు లేకుండా, కేవలం నైతిక బాధ్యతతో ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం బహుశా భారత రాజకీయాల్లో ఇదే తొలిసారి ఏమో అని ఓ బీజేపీ ఎంపీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌లో ప్రధాన్‌ను కలిసిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పరామర్శించే రీతిలో “ఇట్ హ్యాపెన్స్” (రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి) అని వ్యాఖ్యానించారు. దానికి ప్రధాన్ వెంటనే స్పందిస్తూ.. “నథింగ్ హ్యాపెండ్” (ఏమీ జరగలేదు) అని తేల్చిచెప్పారు. సంభాషణను అంతటితో ముగించకుండా, “ఐ యామ్ ఏ STRITI FIGHTER, NOT AN AC ROOM ACTIVIST” (నేను వీధుల్లో పోరాడే యోధుడిని, ఏసీ గదుల్లో కూర్చునే నాయకుడిని కాను) అని స్పష్టం చేస్తూ విపక్షాలకు బలమైన సందేశాన్ని ఇచ్చారు.
Also Read : అయోధ్య విరాళాల చోరీ కేసు: 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం
గతంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా వీధుల్లో పోరాడి పోలీసు దెబ్బలు తిన్న ప్రధాన్, దశాబ్దాల తర్వాత అదే పరీక్షల వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలను అరికట్టలేకపోయాననే నైతిక బాధ్యతతో తప్పుకోవడం ఒక విచిత్రమైన పరిణామం. గతంలో రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నిర్ణయాన్ని గుర్తుచేస్తూ, ప్రధాన్ చర్య ఆయన బలహీనతకు కాదని, జాతీయ ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనమని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. రాజీనామా సమర్పించిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఆయనకు పూర్తి స్థాయిలో అండగా నిలిచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆయన నివాసానికి వెళ్లగా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు విద్యా రంగంలో ప్రధాన్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను కొనియాడారు. ఈ రాజీనామా ఆయన రాజకీయ ప్రాధాన్యతను తగ్గించదని, పార్టీ పరంగా త్యాగానికి చిహ్నమని సమర్థించారు.
ఒడిశాకు చెందిన అగ్రనేతగా ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్టీలో అత్యంత కీలకమైన చరిత్ర ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించి బీజేపీని విజపథంలో నడిపించారు. అంతకుముందు ఉత్తరప్రదేశ్ (2022), బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికల బాధ్యతల్లో తన చాతుర్యాన్ని నిరూపించుకోగా, మే 2026లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ ఆయన ప్రచారం కీలక పాత్ర పోషించింది.
నీట్ (NEET) 2026 పేపర్ లీక్, దేశీయ పరీక్షా విధానంలోని అక్రమాలపై ప్రతిపక్షాల నేతృత్వంలో దేశవ్యాప్త నిరసనలు ఉధృతంగా సాగాయి. పరీక్షల వ్యవస్థలోని ‘లీక్ మాఫియా’ను పూర్తిగా అంతమొందించలేకపోయాననే నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన్ తన పదవిని విడిచిపెట్టారు. కబీర్ దాస్ చెప్పినట్లు తన బాధ్యతను అత్యంత పవిత్రంగా నిర్వర్తించి తిరిగి అప్పగించానని, తదుపరి ఏ బాధ్యతనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు బీజేపీ నాయకత్వం ప్రధాన్‌కు అండగా నిలుస్తుంటే, మరొకవైపు పార్లమెంట్ వెలుపల రాజకీయ వాతావరణం వేడెక్కింది. దేశవ్యాప్త ఆందోళనల సమయంలో విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా నేతృత్వంలో ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రాంగణంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
ఈ ఉద్రిక్తతల నడుమ, పేపర్ లీకేజీల నిరోధక చట్టాన్ని మరింత దృఢంగా మార్చేందుకు ఉద్దేశించిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026’ను లోక్‌సభ చర్చకు సిద్ధం చేసింది. ప్రభుత్వం ప్రతిపక్షాలను తిప్పికొడుతూ ఫ్రంట్‌ఫుట్‌లోనే దాడి పెంచడంతో చట్టసభలో రాజకీయం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.క్యాబినెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ప్రధాన్ రాజకీయంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండటం, త్వరలోనే రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక రాష్ట్రానికి ప్రచార బాధ్యతలు లేదా బీజేపీ సంస్థాగత నిర్మాణంలో అత్యంత కీలకమైన పదవిని ఆయనకు అప్పగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన్ వ్యాఖ్యలు పార్టీలో ఆయన తదుపరి ముఖ్య భూమికకు స్పష్టమైన సంకేతాలని భావిస్తున్నారు.
Also Read : SSY పథకం: రోజుకు రూ.50 పొదుపు చేస్తే.. రూ.8.30 లక్షలు మీ సొంతం.. ఇలా చేస్తే చాలు..!









