Jharkhand :  దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ఎగ్జామ్ కు సంబంధించి పేపర్ లీక్‌ కావడంతో న్యూఢిల్లీలో జెన్-జీ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మెంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఎక్కడా కూడా ఆగలేదు. ఇప్పుడి నిరసన సెగ జార్ఖండ్ కు కూడా పాకింది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జరిగిన భారీ అక్రమాలు, అక్రమ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. దేవేంద్ర నాథ్ మహతో లాంటి అభ్యర్థుల నాయకులు, వందలాది మంది అభ్యర్థులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షలకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Also Read : UPI వాడేవారికి బిగ్ షాక్: డిజిటల్ పేమెంట్లపై ఛార్జీలు వసూళ్లు!

జేపీఎస్సీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాక ఒక అభ్యర్థి OMR షీట్ కార్బన్ కాపీ నెట్‌లో వైరల్ అయ్యింది. సదరు అభ్యర్థి 100 ప్రశ్నలకు గాను కేవలం 48 ప్రశ్నలకే సమాధానాలు గుర్తించినప్పటికీ, అతడు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించినట్లు తేలింది. OMR షీట్లను బయటకు తీసి, దిద్ది బ్యాక్‌డోర్ ఎంట్రీ ఇచ్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 14వ JPSC ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల్లో అనేకచోట్ల ప్రశ్నాపత్రాలు ఉన్న కవర్ల సీల్స్ ముందే తెరిచి ఉన్నాయని అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ లక్షలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు రోడ్డుకెక్కారు. కేవలం ఒక్క JPSC మాత్రమే కాదు.. గత నాలుగైదేళ్లుగా జార్ఖండ్‌లో జరిగిన JSSC-CGL సహా దాదాపు ఏడు రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వడం ఈ ఉద్యమానికి మరింత దారి తీసింది.

పరీక్షలు నిర్వహించే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టడం, ఒకే సిండికేట్ ద్వారా అక్రమాలకు పాల్పడటంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే హేమంత్ సోరెన్ ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే సిఐడి కూడా 19 మందికి పైగా అరెస్ట్ చేసింది. అయితే ఏజెన్సీలు పెద్ద పెద్ద తలకాయలను కాపాడి కేవలం చిన్న చేపలను మాత్రమే పట్టుకుంటున్నాయని, కాబట్టి ఈ కుంభకోణంపై సిబిఐ లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని అభ్యర్థులు పట్టుబడుతున్నారు. రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేసి శాసనసభ ముట్టడికి పిలుపునిచ్చారు.

నిరసనలు మిన్నంటిపోవడంతో జార్ఖండ్ ప్రభుత్వం నలుగురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఓపెన్ స్టేడియంలోనే మా ముందే చర్చలు జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా విద్యార్థుల డిమాండ్‌కు మద్దతు తెలపడమే కాకుండా జేపీఎస్సీ బోర్డు సభ్యులను తక్షణమే తొలగించి, సిబీఐ విచారణ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మొత్తానికి ఏడేళ్లుగా కష్టపడి చదువుకున్న తమ శ్రమ కమీషన్ల కక్కుర్తికి బలవుతోందని, విచారణ పూర్తయి న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.

Also Read : 21 ఏళ్ల కాపురం, ఐదుగురు పిల్లలు! కట్ చేస్తే.. భార్యను ప్రేమికుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.