Parimal Nathwani Victory
Parimal Nathwani Victory

కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవలే మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పర్వంలో మీనాక్షి నటరాజన్‌ రూపంలో కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ పడింది. కాంగ్రెస్ తరపున రాజ్యసభ్య అభ్యర్థిగా మీనాక్షి నామినేషన్‌ వేయగా.. అది తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు జార్ఖండ్‌లోనూ కాంగ్రెస్‌కు నిరాశ తప్పలేదు. అక్కడ గురువారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో NDA మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం సాధించి కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ‘ఇండియా’ కూటమిలో జరిగిన క్రాస్ ఓటింగ్ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.

జార్ఖండ్‌లో రెండు రాజ్యసభ స్థానాలుండగా.. వాటికి ఎన్నికలు జరిగాయి. అందులో NDA మద్ధతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ 28 ఓట్లతో విజయం సాధించారు. అదే సమయంలో పరిమళ్‌కు ప్రత్యర్థి, కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి ప్రణవ్ ఝూ ఓటమి పాలయ్యారు. ఆయనకు కేవలం 20 ఓట్లు రావడంతో పరాజయం పాలయ్యారు. ఇక అధికారంలో ఉన్న జార్ఖండ్‌ ముక్తి మోర్చా (JMM) పార్టీ అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్ల మెజారిటీతో మరో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Also Read : పిచ్చెక్కిపోతారు మావా: అమెజాన్ కొత్త సేల్ రెడీ.. ఆఫర్లే ఆఫర్లు!

Jharkhand Rajya Sabha Election 2026

జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం 81 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఒక రాజ్యసభ సీటు గెలుపొందాలంటే ఒక అభ్యర్థికి కనీసం 28 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అందులోనూ ఆ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికి అసెంబ్లీలో బలం చాలా తక్కువ. ఆ పార్టీ అభ్యర్థికి సపోర్ట్‌గా కేవలం 24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అంటే ఇంకో 4 ఓట్లు వస్తే గానీ NDA అభ్యర్థి పరిమళ్ గెలవడం కష్టం.

మరోవైపు అధికార పార్టీ జేఎంఎం, అలాగే కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమికి భారీ మెజారిటీ ఉంది. అయినప్పటికీ ఇండియా కూటమి తరపు అభ్యర్థి ప్రణవ్ ఓడిపోవడం గమనార్హం. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. పోలింగ్ సమయంలో ఇండియా కూటమికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేశారు. అంటే.. ఆ ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా NDA మద్దతిచ్చిన పరిమళ్‌కు ఓటు వేశారు. దీని కారణంగానే పరిమళ్ నత్వానీ 28 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. దీంతో సొంత కూటమిలోని ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెస్ భారీగా విఫలమైందని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌కు ఇప్పుడు జార్ఖండ్‌లో కూడా షాక్‌ తగలడంతో తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయింది.

Also Read : 108 సెకన్ల వీడియోలో అసలు నిజమేంటీ?