Arvind Kejriwal :  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ, రెండు లక్షలకు పైగా పౌరులు సంతకం చేసిన పిటిషన్ల ప్రింట్‌అవుట్లతో వచ్చే మంగళవారం (ఆగస్టు 4న) ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి ర్యాలీగా వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. లాఠీలకు భయపడని వంద మంది వ్యక్తులతో కలిసి తాను ప్రధాని నివాసానికి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన నేషనల్ టౌన్‌హాల్ అగైన్స్ట్ E20 కార్యక్రమంలో కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధన విధానాన్ని ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో ముడిపెట్టిన ఆయన, అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికే ఈ విధానాన్ని రుద్దుతున్నారని ఆరోపించారు. కాగా, ఈ టౌన్‌హాల్ వేదిక వెలుపల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీసుల మోహరింపు భారీగా ఉన్నట్లు ఆప్ నేతలు తెలిపారు.

Also Read : అనగనగా ఓ రుచిక

ఇటీవల నీట్-యూజీ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో పెద్దఎత్తున నిరసనలు జరిగాయని, జూలై 20న నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జీ తర్వాత ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.

వర్చువల్‌గా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాలుపంచుకోగా, కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన ఆన్‌లైన్ పిటిషన్‌కు ఇప్పటికే రెండు లక్షలకు పైగా సంతకాలు వచ్చాయని కేజ్రీవాల్ చెప్పారు. “నేను వాటి ప్రింట్‌అవుట్లు తీసుకున్నాను. ఆగస్టు 4, మంగళవారం మధ్యాహ్నం, ఆ పిటిషన్లన్నింటినీ అందించడానికి నేను వ్యక్తిగతంగా ప్రధాని నివాసం వైపు వెళ్తాను. అందరూ రావాల్సిన అవసరం లేదు. లాఠీలకు భయపడని 100 మందిని నాతో తీసుకెళ్తాను” అని ఆయన పేర్కొంటూ, ఈ మార్చ్‌లో పాల్గొనాలనుకునే వాలంటీర్లు తనకు ట్యాగ్ చేయాలని ఆహ్వానించారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబానికి లబ్ధి చేకూర్చేందుకే ఈ విధానం తెచ్చారనే వాదనను కేజ్రీవాల్ తోసిపుచ్చారు. భారత్ ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్ల అమెరికన్ వస్తువులను కొనుగోలు చేయాలనే ఇటీవలి ఒప్పందమే అసలు కారణమని, అమెరికాలో ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌కు మార్కెట్ కల్పించేందుకే భారత్‌పై దీన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆయన ఆరోపించారు.

Also Read : రాఫెల్, బ్రహ్మోస్ అవసరమే లేదు.. భారత్ సరికొత్త సీక్రెట్ వెపన్ రెడీ!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.