Ketan Agarwal Murder:  మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కేతన్ అగర్వాల్ హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు మరోక కీలకమైన విషయం తెలిసింది. కేతన్ అగర్వాల్‌తో నిశ్చితార్థం జరగడానికి కొద్ది రోజుల ముందే నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరూ కలిసి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఒక గ్రూపుతో కలిసి వారు ఈ ట్రిప్‌కు వెళ్లారని, అక్కడ వారిద్దరూ గడిపిన సమయాన్ని బట్టి వారి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ప్రయాణ వివరాలను, డిజిటల్ సాక్ష్యాలను, ఫోరెన్సిక్ ఆధారాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

బయట ప్రపంచానికి మాత్రం కేతన్, సియా ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్న జంటలా కనిపించేవారు. సోషల్ మీడియాలో కూడా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు, రీల్స్ ఎంతో సందడిగా ఉండేవి. కానీ, సియాకు కేతన్‌ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని పోలీసుల విచారణలో తేలింది. తాను ఎప్పుడూ కేతన్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని సియా స్వయంగా పోలీసుల ఇంటరాగేషన్‌లో చెప్పింది.

పెళ్లి షాపింగ్ కోసమని చెప్పి సియా తన కాబోయే భర్త కేతన్ దగ్గర నుండి ఏకంగా ఒక కోటి రూపాయలు తీసుకుంది. అలా తీసుకున్న భారీ మొత్తాన్ని ఆమె తన ప్రియుడు చేతన్‌కు ఇచ్చేసింది. చేతన్ సొంతంగా బిజినెస్ పెట్టి, కెరీర్‌లో స్థిరపడటానికి ఈ డబ్బు వాడుకోవాలని ప్లాన్ చేశారు. రాబోయే మూడేళ్లలో చేతన్ ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యాక, సియా వాళ్ల ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడాలని వారిద్దరూ ముందే ఒక పథకం వేసుకున్నారు.

Also Read : ముంబైని ముంచెత్తిన అర్ధరాత్రి వర్షాలు: వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్!

ఈ క్రమంలోనే జూన్ 18వ తేదీన పుణే జిల్లాలోని లోహగఢ్ కోట దగ్గర కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సియా మాటలు నమ్మి కేతన్ ఆమెతో కలిసి ఆ కోటను చూడటానికి వచ్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం చేతన్ వేరే మార్గంలో ఒంటరిగా అక్కడికి చేరుకున్నాడు. కోటలో ఎవరూ లేని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి రాగానే, సియా చేతన్‌కు సైగ చేసింది. వెంటనే చేతన్ వెనుక నుండి వచ్చి కేతన్‌ను లోతైన లోయలోకి నెట్టేశాడు.

ఈ క్రైమ్ నుంచి తప్పించుకోవడానికి చేతన్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ఎక్కడా తన లొకేషన్ దొరక్కుండా ఉండటం కోసం తన సొంత మొబైల్ ఫోన్‌ను షాపులోనే వదిలేశాడు. ప్రయాణంలో అత్యవసర సమాచారం కోసం తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి ఫోన్‌ను వాడుకున్నాడు. అంతేకాదు, కోట దగ్గర సిసిటివి కెమెరాల్లో తన ముఖం గుర్తుపట్టకుండా ఉండటానికి తలకు హుడ్ ఉన్న జాకెట్ వేసుకున్నాడు.

మొదట ఈ ఘటనను అందరూ ప్రమాదవశాత్తూ కాల్ జారి కింద పడిపోవడం వల్లే జరిగిందని అనుకున్నారు. కానీ, కేతన్ చనిపోయిన తర్వాత సియా ప్రవర్తించిన తీరు చూసి కేతన్ కుటుంబ సభ్యులకు గట్టి అనుమానం వచ్చింది. దీంతో జూన్ 21న కేతన్ తండ్రి, మిగతా బంధువులు కలిసి ఆ లోహగఢ్ కోట ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. అక్కడ ఉన్న రోడ్డు, చుట్టుపక్కల పరిస్థితులు చూశాక, ఇది కచ్చితంగా ప్రమాదం కాదు అని వారికి అర్థమైంది. వారి అనుమానంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఈ ఘోరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Also Read : ఆధార్ నుంచి పాస్ పోర్టు వరకు జూలై 1నుంచి మారనున్న రూల్స్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.