
Maharashtra : స్కూలు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఏ స్కూలుకైనా సరే.. 500 మీటర్ల లోపల స్టింగ్ ఎనర్జీ డ్రింక్‌ను గానీ, ఇతర మత్తు పదార్థాలను గానీ అమ్మకూడదని నిషేధం విధించింది. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ఆహార, ఔషధ పరిపాలన శాఖ మంత్రి నరహరి జిర్వాల్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు స్టింగ్ లాంటి ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగుతున్నారు. అయితే వీటి వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుందని డాక్టర్లు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డ్రింక్స్‌లో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో గుండె వేగం పెరగడం, కంగారు, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయి. వీటిల్లో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ. దీనివల్ల చిన్న వయసులోనే ఊబకాయం పళ్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
నిజానికి ఈ బాటిళ్ల మీద చిన్న పిల్లలు తాగకూడదు అని రాసి ఉంటుంది. అయినా సరే, స్కూళ్ల దగ్గర ఇవి విచ్చలవిడిగా దొరుకుతుండటంతో ప్రభుత్వం ఈ యాక్షన్ తీసుకుంది. స్కూళ్ల చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో ఎవరైనా స్టింగ్ లేదా ఇతర ఎనర్జీ డ్రింక్స్ అమ్మితే వారిపై ఎఫ్‌డీఏ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే నష్టాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలని స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఇలాంటి డ్రింక్స్ అమ్మకుండా చట్టం తేవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది.









