UPI : పార్లమెంట్ లో పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ ఆక్ట్ కి సవరణ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో యూపీఐ పేమెంట్లపై త్వరలోనే ఛార్జీలు వసూలు చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. యూపీఐ పేమెంట్లు చేసే సాధారణ ప్రజల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకరి నుంచి మరొకరికి డబ్బులు పంపే విధానం ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే ఉంటుందని వెల్లడించింది. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఆటో, టాక్సీ ఛార్జీలు వంటి రోజువారీ సాధారణ కొనుగోలు చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.

మర్చంట్ డిస్కౌంట్ రేట్ అంటే వ్యాపారులపై విధించే రుసుమును భవిష్యత్తులో ఒకవేళ తీసుకొచ్చినా, అది కేవలం ఒక పరిమితి దాటిన పెద్ద పెద్ద వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అది కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులపై వసూలు చేసే రుసుము కంటే ఇది చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది. వ్యాపారులకు చేసే రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై 0.25 శాతం నుంచి 0.4 శాతం వరకు రుసుము వసూలు చేసేందుకు బ్యాంకులకు, పేమెంట్ యాప్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలో చేసిన మార్పులను కొందరు తప్పుగా అర్థం చేసుకుని, సాధారణ యూజర్లపై ఛార్జీలు వేస్తున్నారని ప్రచారం చేశారని ప్రభుత్వం వివరించింది. యూపీఐ వ్యవస్థ సుదీర్ఘకాలం పాటూ ఎటువంటి ఆటంకం లేకుండా సాగడానికి, సాంకేతికంగా మరింత బలోపేతం కావడానికి, సైబర్ ముప్పుల నుంచి కాపాడడానికే ఈ చట్ట సవరణ తోడ్పడుతుందని తెలిపింది. యూపీఐలో జరిగే అత్యధిక శాతం వ్యాపార లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని, ఛార్జీలు అనేది కేవలం కొన్ని పెద్ద లావాదేవీలకే పరిమితమని స్పష్టం చేసింది. పార్లమెంటులో ఈ కొత్త బిల్లు ఆమోదం పొందిన తర్వాతే, ఏ వ్యాపారులపై ఎంత రుసుము వేయాలనేది ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.