
Malaysia Airlines : ఇటీవల రోడ్డు మీద ప్రయాణించే వాహనాల్లాగే ఆకాశంలో ప్రయాణించే విమానాల్లోనూ తరుచుగా సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో విమానం ఎక్కిన ప్రయాణీకులు గమ్యం చేరేదాకా నమ్మకం లేని పరిస్థితి నెలకొంటుంది.
తాజాగా ఈ రోజు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ అనూహ్య సంఘటన కలకలం రేపింది. కౌలాలంపూర్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం (MH156)లో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చెన్నై ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఎయిర్‌బస్ A330-200 రకానికి చెందిన ఈ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 186 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
సాంకేతిక సమస్యతో చెన్నై విమానశ్రయంలో దిగడంతోనే విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీంతో షెడ్యూల్ ప్రకారం సోమవారం సాయంత్రం 4.40 గంటలకు చేరుకోవాల్సిన ఈ విమానం, కొద్ది నిమిషాల ఆలస్యంగా 4.44 గంటలకు సురక్షితంగా రన్‌వేపై దింపారు. ఈ సందర్భంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో విమానం సురక్షితంగా కిందకు దిగింది. అనంతరం ఇంజిన్ లోని సమస్యను పరిష్కరించిన తర్వాత తిరిగి బయలుదేరింది. ఈ ఘటనపై చెన్నై ఎయిర్‌పోర్టు సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది చాలా సున్నితమైన విషయమైనప్పటికీ పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ల్యాండింగ్ సాఫీగా జరిగిందని తెలిపారు. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు’ అని వెల్లడించారు.









